
‘సందులో సంబరాల శ్యాంబాబు’ (sss) సినిమాకు జనసేన శ్రీకారం
ఏపీలో రాజకీయాలకు సినిమాలు వేదిక అవుతున్నాయి. రాజకీయాలను సినిమాల్లో జొప్పించడం కొత్త కాదు. కానీ ఇటీవల కాలంలో రాజకీయాలు, రాజకీయ నేతల మీదే అనేక సినిమాలు వచ్చాయి. వాటిపై వివాదాలు కూడా చెలరేగాయి. కానీ తాజా పొలిటికల్ వార్ చిత్రమైన టర్న్ తీసుకుంటోంది. జనసేన, వైసీపీల మధ్య ఈ వార్ కొనసాగుతోంది. జనసేనకు టీడీపీ మద్దతు ఉందని ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి శ్యాంబాబు అనే ఒక క్యారెక్టర్ ఉందని ప్రచారం సాగుతోంది. బ్రో సినిమా అంతగా సక్సెస్ కాలేదనీ, అది ఫెయిల్ అయ్యిందని అంబటి రాంబాబు సంబరాలు చేస్తూ డ్యాన్సులు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్రో సినిమాకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ అంబటి అనుమానాలు వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రెమ్యూరేషన్ ఎంత అంటూ ప్రశ్నించారు. అమెరికా నుంచి సినిమాకు నిధులు అందాయని ఆరోపించారు. నిర్మాత ద్వారా పవన్‌కు డబ్బులు అందాయని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర నిఘా సంస్థలకు ఫిర్యాదు చేస్తానన్నారు. దీని కోసం గురువారం (ఆగస్టు 3న) ఢిల్లీ వెళ్లేందుకు ఆయన సిద్ధపడ్డారు.
కాగా, అంబర్ రాంబాబు పవన్ కళ్యాణ్‌కు కౌంటర్‌గా తీసిన మ్రో (ఎంఆర్వో) సినిమాకు కౌంటర్‌గా జనసేన కార్యకర్తలు ఎస్ఎస్ఎస్ పేరిట ఒక సినిమాకు శ్రీకారం చుట్టారు. బుధవారం దీనికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమా ప్రొడక్షన్‌ను ప్రారంభిస్తూ పూజలు చేశారు. ప్రొడక్షన్ నెంబర్ 6093పేరిట జగ్గుభాయ్ సమర్పించు ‘సందులో సంబంరాల శ్యాంబాబు’ షూటింగ్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలాంటివే మరో ఎనిమిది సినిమాలు తీసి వెబ్ సిరీస్‌గా విడుదల చేస్తామని చెప్పారు. దీంతో ఏపీ పాలిటిక్స్‌లో పొలిటికల్ మూవీ వార్ పతాక స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు.