
తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో తనకే తెలియదని, ఏఐసీసీ ఎట్లా చెబితే అట్లా నడుచుకుంటానని ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. పాలేరు నుంచి పోటీ చేయాలని ఆయన ఆసక్తి చూపుతున్నా అదే స్థానం కావాలని నిన్న పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వర్రావు పట్టుబడుతున్నారు. పాలేరులో పోటీ, ఖమ్మం రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆయన సీడబ్ల్యూసీ సమావేశాల వేదికైన తాజ్ కృష్ణా వద్ది మీడియాతో చిట్ ఛాట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి ఉందని ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆకాంక్షను వెల్లడించారు. అయితే అధిష్టానం ఎంపీగా పోటీ చేయమన్నా అందుకు తాను సిద్ధమన్నారు. ఖమ్మంలో మూడు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో (ఖమ్మం, కొత్త గూడెం, పాలేరు) ఆ పార్టీని ఓడించడమే తన లక్ష్యమని చెప్పారు. ఖమ్మం జిల్లాలో క్యాస్ట్ ఈక్వేషన్ ముఖ్యమని, పోటీ దాని ప్రకారమే ఉండవచ్చన్నారు. ఈ లెక్కన ఖమ్మం సెగ్మెంట్లో తుమ్మల, అజయ్ ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారని చెప్పకనే చెప్పారు. పాలేరులో తానూ, కందాల ఉపేందర్ రెడ్డి ఒకే క్యాస్ట్ కనుక ఈ కాంబినేషన్ కుదురుతుందని ఆయన అన్యాపదేశంగా చెప్పారు. షర్మిల పొత్తు, విలీనంపై క్లారిటీ రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ రాజకీయం అర్థం కావడానికి కొంత టైమ్ పడుతుందని చెప్పారు. ఈ నెల 22 తర్వాత మైనంపల్లి చేరిక ఉండవచ్చునన్నారు.