
కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మరో అడుగు ముందుకు పడినట్లైంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొంది పార్లమెంట్లో చట్టబద్దత లభిస్తే చట్టసభల్లో 33 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. ఆ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు సమూలంగా మారనున్నాయి.
రాష్ట్ర శాసనసభలో 119 స్థానాలు ఉన్నాయి. 33 శాతం అంటే 40 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి.ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రాష్ట్రంలో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 స్థానాలు ఉన్నాయి. 33 శాతం చొప్పున ఎస్సీ నియోజకవర్గాల్లో 6, ఎస్టీ నియోజకవర్గాల్లో 4 మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుంది.
మిగిలిన 88 నియోజకవర్గాల్లో.. 30 స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. అయితే మహిళలకు స్థానాల కేటాయింపు కోసం ఏ పద్ధతి అనుసరిస్తారన్నది బిల్లులో స్పష్టత రానుంది
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా నియోజకవర్గాల సంఖ్య విషయంలో భారీ వ్యత్యాసం ఉంది. హైదరాబాద్ జిల్లాలో ఏకంగా 15 నియోజకవర్గాలు ఉండగా.. కొన్ని జిల్లాల్లో ఒకే ఒక్క నియోజకవర్గం మాత్రమే ఉంది. తద్వారా జిల్లా యూనిట్‌గా మహిళా రిజర్వేషన్ల అమలు కష్టం కావచ్చు.
ఏడు అసెంబ్లీల సీట్ల చొప్పున ఉండే లోక్‌సభ నియోజకవర్గం యూనిట్‌గా మహిళా సీట్లను కేటాయించే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. సాధారణంగా ఎక్కువ మంది మహిళా ఓటర్ల ఉన్న స్థానాలను మొదట మహిళలకు కేటాయించి ఆ తర్వాత రొటేషన్ విధానంలో మిగతా సీట్లను కేటాయించవచ్చు.. లేదా లాటరీ విధానంలో కేటాయింపు చేయవచ్చు.
2023 : ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలోని.. 64 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. మహిళలు సీట్ల కేటాయింపు ఏ పద్ధతిన చేస్తారన్న విషయంపై ఇప్పటి వరకు ఆయా స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహించే నేతల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
రాష్ట్రానికి లోక్‌సభలో 17 స్థానాలు ఉండగా.. అందులో మూడో వంతు అంటే ఆరు సీట్లు మహిళలకు దక్కనున్నాయి. ఎస్సీ స్థానాలు మూడు, ఎస్టీ నియోజకవర్గాలు రెండు ఉన్నాయి.