
“ఎవరి పాలవుతున్నాదో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ..” అంటూ మొదలుపెట్టి ‘‘దొరల పాలవుతున్నాదిరో మన తెలంగాణ” అంటూ కేసిఆర్ పాలనపై గానం చేసిన ఏపూరి సోమన్న బీఅర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
కేటీఆర్ని మర్యాదపూర్వకంగా కలిసి ఆలింగనం చేసుకున్నారు. త్వరలో ఆయన బిఆర్ఎస్లో చేరనున్నారు. సోమన్న నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్ ఆయన చేరిక చేరికకు రంగం సిద్ధం చేశారు.
సోమన్న తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం గజ్జెకట్టి పాడారు. రాత్రనకా పగలనకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. గద్దర్ స్ఫూర్తితో ఆయనను అనుకరిస్తూ ప్రత్యేక ఆహార్యం ఏర్పర్చుకున్నారు. పదునైన పాటలతో తెలంగాణ జనానికి అభిమాన గాయకుడయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సాకారం తర్వాత కొన్నేళ్లు కేసీఆర్ పాలన చూసిన సోమన్న ఇది తామాశించినట్లుగా లేదని తిరుగుబాటు బావుటా ఎగరేశారు. కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో గజ్జెకట్టి పాటపాడారు. ఈ క్రమంలోనే ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ గీతాన్ని రాసి ఆలపించారు.
తర్వాత షర్మిల పెట్టిన వైస్సార్ టీపీలో చేరి ఆమెకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకొని తాను ప్రజాప్రతినిధిగా కావాలనే కల నెరవేరుతుందని ఆశించారు. కానీ షర్మిల ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో గత్యంరం లేని స్థితిలో తాను ఇన్నాళ్లు ఎవరికి వ్యతిరేకంగానైతే గానం చేశారో ఆ దొర చెంత చేరాల్సి రావడం విషాదం.
అంతేకాదు ప్రజాస్వామిక పాలనలో ఏదో ఒక పార్టీల పంచన చేరి తమ ఆకాంక్షలు నెరవేర్చుకోవాల్సిన దయనీయమైన స్థితి ఏర్పడడం మరో బాధాకర అంశం. ఎవరో ఒక పార్టీలో చేరకపోతే ముందుకుపోలేమన్న భావన పరిస్థితి అత్యంత దురదృష్టకరమైన విషయం.
