
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తోందని ఆ పార్టీ నేత మధు యాష్కీ అన్నారు. సర్వేల పేరు చెప్పి బడుగులకు టికెట్ నిరాకరించే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. గాంధీభవన్లో ఆదివారం కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం జరిగింది. వీహెచ్, పొన్నాల లక్ష్యయ్య, మధు యాష్కీ, కత్తి వెంకటస్వామి తదితర నేతలు ఈ భేటీలో ఉన్నారు. సమావేశం అనంతరం మధు యాష్కీ వివరాలు వెల్లడించారు.
కాంగ్రెస్లో సామాజిక న్యాయం పాటిస్తామని అధిష్టానం చెబుతూ వస్తోందనీ, రాష్ట్రంలో బీసీలకు 34 సీట్లు ఇస్తామని చెప్పారని యాష్కీ గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. బీఆర్ఎస్ బీసీలకు 23 టికెట్లు ఇచ్చిందన్నారు. దీని కో సం రేపు ఢిల్లీవెళ్లి ఖర్గే, సోనియా గాంధీని కలుస్తామని చెప్పారు. రాష్ట్రంలోని బీసీ ముఖ్య నేతలమంతా వెళ్తామన్నారు.
సీడబ్ల్యుసీలో కూడా బీసీ నేతలకు చోటు లభించలేదని మధు యాష్కీ అన్నారు. వచ్చేది కాంగ్రెస్ సర్కారే అంటున్న రాష్ట్ర నేతలు అందులో బహుజన పాత్ర ఏమిటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ బలోపేతం కావాలంటే బహుజనుల సపోర్ట్ కావాలన్నారు. పార్టీలో సామాజిక సమతుల్యత అవసరమని అభిప్రాయ పడ్డారు. బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ఒకటికి రెండు సీట్లు కేటాయించే అవకావం ఉందని ఆయన అన్నారు.