
రాజధాని నగర పౌరులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూసి, ఈసా నదులపై వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణ పనులు త్వరలో సాకారం కానున్నాయి. అందులో భాగంగా మూసీనదిపైన, ఈసానదిపైన వంతెనల నిర్మాణానికి అవసరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మూసి, ఈసా నదులపై 14 బ్రిడ్జిలు(వంతెనలు) నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కరోనా (కోవిడ్) వల్ల రెండు సంవత్సరాల పాటు ఎదురైన పరిస్థితుల కారణంగా మూసి, ఈసా నదులపై వంతెనల నిర్మాణ కార్యాచరణలో జాప్యం చోటుచేసుకుంది. ఈ పనులకు సోమవారం కేటీఆర్ శంకు స్థాపన చేయనున్నారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో మూసినదిపైన మూడు(3) చోట్ల, ఈసానదిపై రెండు(2) చోట్ల వంతెనల నిర్మాణ పనులకు ముందడుగు పడింది. సుమారు రూ.168 కోట్ల వ్యయంతో ఐదు(5) వంతెనల నిర్మాణ పనులకు హెచ్ఎండిఏ ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రోక్యుర్మెంట్ అండ్ కన్ స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది.
దాదాపు ఏడాదిన్నర కాలంలో హెచ్ఎండిఏ అన్నివంతెనల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు, వాహనచోదకులకు అందుబాటలోకి తీసుకునిరావాలని ప్రభుత్వం ధృఢసంకల్పంతో ఉంది. మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రయాణదూరం, సమయం గణనీయంగా తగ్గుతుంది.