
వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సెప్టెంబర్ నెలాఖరుకు పార్టీ భవిష్యత్తు గురించి ఏదో ఒకటి తేలుతుందని పెట్టిన గడువు ముగిసింది. ఒక రకంగా ఆమె కాంగ్రెస్‌కు ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసిందని చెప్పుకోవచ్చు. షర్మిల తనతోపాటు కొందరు నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానికి పెట్టిన ప్రపోజల్‌కు అంగీకారం కుదరలేదు. పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్‌లను కలుసుకున్న సందర్భంగా ఆమె ఈ ప్రతిపాదన వారి ముందు పెట్టినట్లు సమాచారం. అయితే రాష్ట్ర నేతలతో చర్చించిన తర్వాత ఈ ప్రపోజల్‌కు అంగీకరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధం కాలేదు. అయినా వారి ఆలోచనలో మార్పు వస్తుందని ఆశించిన షర్మిల చివరకు పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి తనకు తాను డెడ్‌లైన్ విధించుకున్నారు. ఏం జరిగినా పార్టీ నేతలకు మంచి జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ నుంచి ఆమె ఆశించిన స్పందన రాలేదు. కానీ పార్టీ కొన్ని చర్యలకు పూనుకుంది.

కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలును రంగంలోకి దింపిన హైకమాండ్ అక్టోబర్ 1వ తారీఖున చర్చలు జరిపింది. వాస్తవానికి ఇందుకు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చొరవ చూపినట్లు తెలుస్తోంది. సునీల్ కనుగోలుతో జరిపిన చర్చలు సానుకూలంగా ముగిసాయని తెలిసింది. షర్మిలకు పార్లమెంట్ సీటుతో పాటు కొందరు నేతలకు పార్టీలో స్థానం కల్పించనున్నట్లు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగా షర్మిల రేపు, లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా, రాహుల్ సమక్షంలో షర్మిల పార్టీని విలీనం చేసే అవకాశం ఉంది.