
దేశంలో నెలకొన్న దారుణమైన పరిస్థితుల్లో కవులు, రచయితల ఐక్య సంఘటన అవసరమని అఖిల భారత అరసం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. పాలకుల ద్వారానే భారతదేశంలో ఫాసిజం అడుగుపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) రాష్ట్ర మూడవ మహాసభలు హైదరాబాద్ బొగ్గుల కుంట ,డాక్టర్ సి.నారాయణ రెడ్డి నగర్ సారస్వత పరిషతు) ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ అరసం ప్రధాన కార్యదర్శి ఏటుకూరి ప్రసాద్ నారాయణ రెడ్డి నగర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అరసం పతాకాన్ని ఆవిష్కరించారు.

అరసం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి.రామారావు సభాధ్యక్షతత జరిగిన ఈ ప్రారంభ సభలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ కీలకోపన్యాసం చేశారు. ముఖ్యఅతిథిగా పెనుగొండ లక్ష్మీనారాయణ, విశిష్ఠ అతిథిగా తెలంగాణ ఉర్ధూ అరసం ఉపాధ్యక్షురాలు ఔదేశ్ రాణి,ఆత్మీయ అతిథులుగా అఖిల భారత అరసం కార్యదర్శి వేల్పుల నారాయణ, ఆంధ్రప్రదేశ్ అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ హాజరయ్యారు.అరసం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొమ్మగాని నాగభూషణం, కార్యదర్శి కెవిఎల్ పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆర్థిక ప్రయోజనాల కోసం మణిపూర్ రెండు తెగాల మధ్య అల్లర్లను సృష్టించారని, మెజార్టీ తెగను ప్రభుత్వమే ప్రొత్సహిస్తోందని విమర్శించారు. ఆ రాష్ట్రంలో అటవీక కార్యకలాపాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ ఘనటను కొనసాగింపుగా హర్యాన రాష్ట్రంలో ఘర్షణలు జరగడం దుష్పనిణామమని అన్నారు .తాజా పరిణామాల నేపథ్యంలో కొత్త లక్షాల సాధన దిశగా సాంస్కృతిక ఉద్యమం సాగాలన్నారు.
దేశంలో ప్రజాసాంస్కృతిక పునఃనిర్మాణం అవసరమని: కె.శ్రీనివాస్

కె.శ్రీనివాస్ మాట్లాడుతూ పాలకులు మారినా వారు వేసిన విష బీజాలను తొలగించేందుకు దశాబ్ధాల కాలం పడుతుందని, వాటిని తొలగించడం సాంస్కృతిక ఉద్యమం ద్వారానే సాధ్యమన్నారు. ప్రస్తుతం ముస్లిం,క్రైస్తవులు, కమ్యూనిస్టులతో పాటు ఉదార ప్రగతిశీల శక్తులను కూడా హిందూత్వవాద శత్రువులు చూపిస్తున్నారని తెలిపారు.భావ, సాంస్కృతికపరమైన దాడులు జరుగుతున్నాయని, గౌరీ లంకేశ్ ఘటన ఇందులో భాగమని అన్నారు. దేశంలో ప్రజాసాంస్కృతిక పునః నిర్మాణం అవసరమని, ఇందులో అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. మతతత్వం, జాతీయవాదం ప్రమాదంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసులు, దళితులపైన కూడా మతతత్వం ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భావాల సంఘర్షన విస్తృతంగా ప్రజల్లోకి సంయమనంగా తీసుకెళ్లడం అరసం నుండి నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు.
మానవాళి ఉన్నంత వరకు అరసం : ఆర్వీ రామారావు
ఆర్.వి.రామారావు మాట్లాడుతూ జాతీయవాదం పేరుతో మతోన్మాదం వెయ్యి పడగలతో వచ్చిందన్నారు. సెక్యులర్,సోషలిస్టు పదాలు అధికారంలో ఉన్న వారికి కంపరంగా మారిందన్నారు .మోడీ అధికారంలోనికి వచ్చిన తర్వాత 2015 సంవత్సరంలో ప్రచురితమైన పత్రికా ప్రకటనల్లోనే సెక్యులర్, సోషలిస్ట్ పదాలు కనిపించలేదని గుర్తు చేశారు. మానవత ప్రయోజనాల కోసమే అరసం ఏర్పడిందని, మానవా ఉన్నంత వరకు అరసం ఉంటుందన్నారు.

కందిమళ్ల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రగతిశీల కళాకారులు,రచయితలు ఏకం కావాల్సిన అవసరం వచ్చిందన్నారు. రజాకార్ల సినిమా పేరుతో చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఎవరో ఇద్దరు చెప్పిన అంశాల ఆధారంగా నిజాంపై జరిగిన పోరాటాన్ని హిందూ, ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వేల్పుల నారాయణ మాట్లాడుతూ ప్రగతిశీలవాదులు, మతోన్మాదులగా రెండు వేర్వేరు దారులు ఉన్నాయని , ప్రజల వైపు ప్రశ్నించే గొంతుకలుగా అరసం నిలుస్తుందన్నారు.
ఏటుకూరి ప్రసాద్ మాట్లాడుతూ జాతీయవాదం, మతోన్మాదం అనే రెండు కాళ్లపై కేంద్ర ప్రభుత్వం పయనిస్తోందని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహారించే ఈ కాళ్లను విరగొట్టాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉండాలని అభ్యుదయ రచయితలు కోరుకుంటారని అన్నారు.