
- పబ్లిక్ గార్డెన్ లో గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించిన కేయూ స్టూడెంట్స్
- 12 గంటలకు ఆత్మార్పణ చేసుకుంటామని డెడ్ లైన్
- అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడికి తీసుకెళ్లినా ఆత్మార్పణలు ఆగవన్న విద్యార్థులు
- అరెస్టులకు నిరసనగా రేపు కేయు బంద్ కు పిలుపునిచ్చిన స్టూడెంట్ జేఏసీ

- హనుమకొండ లోని పబ్లిక్ గార్డెన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్లలో అక్రమాలు జరిగిన విషయమై 26 రోజుల నుంచి కేయూ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కాగా వారం కిందట పూర్తి ఆధారాలతో పోలీసులు, వర్సిటీ ఆఫీసర్లకు విన్నవించినా యాక్షన్ తీసుకోవడం లేదనే ఆవేదనతో బాధిత స్టూడెంట్స్ ఆత్మార్పణకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే గాంధీ జయంతి రోజున ఆత్మార్పణ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రెండురోజుల కిందట పోలీసులకు వినతిపత్రం కూడా ఇచ్చారు. అక్టోబర్ 2న ఉదయం 11 లోగా ఆఫీసర్లు స్పందించాలని లేదంటే మధ్యాహ్నం 12 గంటలకు సామూహిక ఆత్మార్పణ చేసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఇవ్వాళ ఉదయం కేయూ స్టూడెంట్స్ పబ్లిక్ గార్డెన్ లోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. ఆఫీసర్ల మౌనాన్ని ఖండిస్తూ చేతులకు సంకెళ్లు, బ్లాక్ రిబ్బన్ తో నిరసన చేపట్టారు.

మంత్రి రాకకు ముందే విద్యార్థుల అరెస్ట్.. ఉద్రిక్తత
గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ గార్డెన్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు మంత్రి దయాకర్ రావు, చీఫ్ వినయ్ భాస్కర్ ఇతర నేతలు ఉదయం 9 గంటలకు గాంధీ విగ్రహం వద్దకు రావాల్సి ఉంది. అప్పటికే స్టూడెంట్స్ నిరసన కొనసాగుతుండగా అలెర్ట్ అయిన పోలీసులు 8 గంటల వరకు అక్కడికి చేరుకున్నారు. హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్ నేతృత్వంలో పోలీసు పెద్ద ఎత్తున మోహరించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమించాల్సిందిగా కోరారు. తమ గోడు మంత్రి, చీఫ్ విప్ తో పాటు ఇతర లీడర్లకు చెప్పుకుంటామని, ఆందోళన విరమించేది లేదని స్టూడెంట్స్ పట్టుబట్టారు. దీంతో పోలీసులు మాచర్ల రాంబాబు, అరెగంటి నాగరాజు, బొట్ల మనోహర్ సహ ఇతర స్టూడెంట్లను బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. కాగా తమను వివిధ స్టేషన్లు తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అరెస్ట్ అయిన స్టూడెంట్స్ వాపోతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తమను ఎక్కడికి తీసుకెళ్లినా ఆత్మార్పణలు మాత్రం ఆగవని స్పష్టం చేశారు. తమ మరణంతోనైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, వీసీ రిజిస్ట్రార్ లకు బుద్ధి రావాలని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు స్టూడెంట్లను ధర్మసాగర్ పీఎస్ కు తరలించగా.. అక్కడ ఆమరణ దీక్షకు దిగారు. వర్శిటీ ఆఫసర్లు అక్కడికే వచ్చి చర్చలు జరపాలని, లేదంటే నీళ్లు, తిండి ముట్టకుండా ఆత్మార్పణ చేసుకుంటామని స్పష్టం చేశారు.
రేపు కేయూ బంద్ కు పిలుపు
పీహెచ్ డీ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న స్టూడెంట్ల ను అరెస్ట్ చేయడాన్ని కేయూ స్టూడెంట్ జేఏసీ లీడర్లు ఖండించారు. విద్యార్థుల అరెస్టులకి నిరసనగా రేపు జేఏసీ ఆధ్వర్యంలో కేయూ బంద్ కు పిలుపునిచ్చారు. అర్హులైన విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు పోరాటాలు ఆపేది లేదని హెచ్చరించారు.