
ఊసులేనోడు వచ్చి వారసత్వ రాజకీయం అని అంటున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. నల్గొండ, సూర్యాపేట సభల్లో ఆయన ప్రసంగించారు.
“మాది పక్కా రాజకీయ వారసత్వమే. బీఆర్ఎస్ పార్టీది బరాబర్ రాజకీయ వారసత్వమే. రాణి రుద్రమ్మ రాజసంతో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది. మాకున్నది తెలంగాణ తెగువ.. తెలంగాణ పౌరుషం. రాణి రుద్రమ్మ వారసత్వం కాబట్టే.. గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేసుకున్నాం. గొప్ప గొప్ప ఆలయాలు.. యాదాద్రి వంటి ఆలయాలను కట్టుకున్నాం. ఆనాడు కాకతీయులు చేసిన పనిని ఈనాడు మళ్లీ కేసీఆర్ చేస్తున్నారు. ఆదివాసీ యోధుడు కుమ్రం భీం వారసత్వం మాది. అందుకే ఆనాడు కుమ్రం భీం జల్ జంగల్ జమీన్ అంటే.. ఈ రోజు అదే జల్ జంగల్ జమీన్ నినాదాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌ది. పక్కా మాది కుమ్రం భీం వారసత్వమే. బహుజన వీరుడు సర్వాయి పాపన్న వారసత్వం మాది. బడుగు వర్గాలకు బలమిచ్చేలాగా, చేతి, కుల వృత్తులకు కొత్త ఊపిరినిచ్చిన ప్రభుత్వం ఇది. దళిత జాతి వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ వారసత్వం మాది” అన్నారు.
” గురుకుల విప్లవంతో అణగారిన బిడ్డల్లో అక్షర వెలుగులు నింపుతున్న ప్రభుత్వం మాది. వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు పెట్టి అద్భుతాలు చేస్తున్న ప్రభుత్వం మాది. 1952, 1969, 2001, 2014 ఉద్యమాల్లో అసువులుబాసిన అమరుల ఆశయాల వారసత్వం మాది. శ్రీకాంతాచారి ఆశయాల వారసత్వం మాది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని ఇవాళ విధానంగా మార్చుకొని, సమర్థవంతంగా అమలు చేస్తున్న రాజకీయ వారసత్వం మాది. నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అని చెప్పిన దాశరథి, కాళోజీల సాంస్కృతిక వారసత్వం మాది. తల్లి తెలంగాణకు జన్మనిచ్చి, అస్థిత్వాన్ని ఆకాశమంత ఎత్తుకు నిలబెట్టిన తనయుడి ప్రభుత్వం, వారసత్వం, కేసీఆర్ నాయకత్వం మా సొంతం” అని కేటీఆర్ ఉద్ఘాటించారు.