
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 9 నియోజక వర్గాల్లోనే పోటీ చేయాలని మజ్లిస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఉన్న ఏడు సిట్టింగ్ స్ధానాలతో పాటు మరో రెండు స్ధానాల్లో రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌లో పోటీ చేయాలని నిర్ణయించింది. పార్టీలో సీనియర్‌గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్, పాషాఖాద్రిలకు ఈసారి టికెట్ఇవ్వడం లేదని పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. పైగా కొత్తగా ఈసారి ఇద్దరు నేతలకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇందులో చార్మినార్ నియోజక వర్గం నుంచి మాజీ మేయర్ జుల్పికర్అలీని రంగంలోకి దించగా, నాంపల్లి నియోజక వర్గం నుంచి మరో మాజీ మేయర్ మాజిద్హుస్సేన్ను అభ్యర్ధిగా ప్రకటించారు. అలాగే నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ ను యాకుత్‌పురా నుంచి పోటీకి దించారు. మొత్తం 9 స్ధానాల్లో పోటీ చేస్తామని చెప్పిన పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరుగురు అభ్యర్ధులను ప్రకటించారు.
సిట్టింగ్లతో కలిపి 9 స్ధానాల పై మజ్లిస్నజర్
నగరంలో పటిష్టమైన ఓటు బ్యాంకు వున్న మజ్లిస్ ఈఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా తమ సిట్టింగ్సీట్లతో పాటు మరో రెండు స్ధానాలను కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం చార్మినార్, యాకుత్‌పురా, నాంపల్లి, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, కార్వాన్, మలక్‌పేట నియోజక వర్గాలు మజ్లిస్చేతిలో ఉన్నాయి. ఈసారి మరో రెండు స్ధానాలను జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ ను కూడా కైవసం చేసుకోవాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. గత కొంత కాలంగా పార్టీలో అసమ్మతి పోరు పెరుగుతోంది. ముఖ్యంగా వృద్ద నేతలకు ఈసారి టికెట్ ఇవ్వకుండా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే యాకుత్‌పురా ఎమ్మెల్యే పాషాఖాద్రి, చార్మినార్ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌కు టికెట్ ఇవ్వక పోవడం పై పార్టీలో వారి మద్దతు దారులు అసంతృప్తితో వున్నారు. అలాగే బహదూర్ పురా అబ్యర్ధిని కూడా పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడి నుంచి సిట్టింగ్‌కు ఇస్తారా? లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అన్నవిషయం పై సస్పెన్స్ నెలకొంది. యువతకు ప్రాధాన్యత అన్న నినాదంతో నాంపల్లి నుంచి మాజిద్‌హుస్సేన్, యాకుత్‌పురా నుంచి జాఫర్ హుస్సేన్ మెరాజ్‌ను రంగంలోకి దింపారు. త్వరలోనే జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, బహదూర్ పురా నుంచి కూడా యువతకు అవకాశం కల్పించే అవకాశం ఉందని అంటున్నారు.
ముంతాజ్ఖాన్తీరు పై ఉత్కంఠ!
పార్టీలో తన సీటుకు ఎసరు వస్తుందని ఊహించిన ముంతాజ్‌ఖాన్ మొదటి నుంచి అధినేత తీరును ఎదురిస్తూనే వున్నారు. తనకు టికెట్ ఇవ్వక పోతే తన కుమారుడికి ఇవ్వాలని లేక పోతే తాను ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానంటూ సవాల్ విసిరారు. ఆయను బుజ్జగించడానికి పార్టీ అధినేత అసదుద్దీన్ ప్రయత్నించి ఆయన ససేమిరా అన్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం. అయితే తన కుమారుడికి కాకపోతే తాను సూచించిన జుల్పికర్అలీకి టికెట్ ఇవ్వాలని ఆయననే చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ నియోజక వర్గం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ తన కుమారుడు నూరుద్దీన్‌కు ఇవ్వాలని పట్టుబట్టినట్టు తెలుస్తోంది. అయితే అందరూ ఊహించినట్టుగానే యాకుత్‌పురా నుంచి ముంతాజ్‌కు టికెట్రాలేదు. కానీ ఆయన సూచించిన జుల్ఫికర్‌కు టికెట్రావడంతో ఆయన శాంతిస్తారా? లేదా? అన్నది కూడా స్పష్టం కావడం లేదు. కానీ ఇద్దరు సీనియర్ నేతలకు టికెట్ నిరాకరించినా వారి అనుభవాన్ని పార్టీకి ఉపయోగించుకుంటామని ఈసందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. కానీ శుక్రవారం అసదుద్దీన్నిర్వహించిన మీడియా సమావేశానికి ముంతాజ్ హాజరు కాలేదు. దీంతో ఆయన ఇంకా తన అసంతృప్తిని వీడలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
మూడు నియోజక వర్గాలపై మజ్లిస్ గురి
కాగా ఈసారి ఎన్నికల్లో మజ్లిస్సిట్టింగ్ స్థానాల్లో ఒకటైన బహదూర్‌పురాకు ప్రస్తుత ఎమ్మెల్యే మోజం ఖాన్‌కే తిరిగి టికెట్ ఇస్తారా? లేక ఇక్కడ కూడా అభ్యర్ధిని మారుస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. అందుకే శుక్రవారం ప్రకటించిన స్దానాల్లో బహదూర్పురాను మినహాయించారు. బహదూర్ పురాతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్లకు త్వరలో అభ్యర్దులను ఖరారు చేస్తామని పార్టీ అధినేత అసదుద్దీన్ తెలిపారు. అయితే గత కొంత కాలంగా అక్బరుద్దీన్ కుమారుడిని రంగంలోకి తీసుకు రావాలని ప్రయత్నం జరుగుతున్న నేపద్యంలో ఆయనను జూబ్లీహిల్స్ నుంచి పోటీకి దింపే అవకాశం ఉందని పార్టీలో వర్గాల సమాచారం. అలాగే గత ఎన్నికల్లో రెండోస్దానానికే పరిమితమైన రాజేంద్రనగర్‌ను ఎలాగైనా ఈసారి గెలుచుకోవాలని మజ్లిస్ పట్టుదలగా వుంది. సిట్టింగ్లతో కలిపి మొత్తం 9 స్దానాలను ఈసారి కైవసం చేసుకునేందుకు మజ్లిస్ వ్యూహరచన చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేయనున్న స్ధానాలు ఇవే
…………………………………………………………………………………………………
నియోజక వర్గం… అభ్యర్ధి
…………………………………………………………………………………………………
1. చాంద్రాయణగుట్ట….. అక్బరుద్దీన్ ఓవైసీ
2. చార్మినార్…… మీర్ జుల్పికర్ అలీ
3. కార్వాన్….. కౌసర్ మొయినుద్దీన్
4. మలక్‌పేట…. అహ్మద్ బిన్ అబ్ధుల్లా బలాల
5. నాంపల్లి…. మమ్మద్ మాజిద్ హుస్సేన్
6. యాకుత్‌పురా… జాఫర్ హుస్సేన్ మెరాజ్
7. బహదూర్‌పురా…. పెండింగ్
8. రాజేంద్రనగర్…. పెండింగ్
9. జూబ్లీహిల్స్…. పెండింగ్