
అన్ని సరకుల ధరలూ కొండెక్కాయి.. మార్కెట్లల్లో కూరగాయల ధరలు చూస్తుంటే తినేలా లేవు. భారీ వర్షాల కారణంగా టొమాటోల సరఫరాకు ఆటంకాలు ఎదురుకావడంతో వాటి సప్లై తగ్గి ధర ఆకాశాన్నంటిన విషయం మనకు తెలిసిందే. అయితే ఒక్క బంగాళాదుంపలు తప్ప మిగతా సరుకుల (ఫుడ్ ఐటమ్స్) ధరలు సైతం బాగా పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు తేల్చాయి. ఈ విషయాన్ని ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వయంగా పార్లమెంటులో వెల్లడించింది. కందిపప్పు గరిష్టంగా 28 శాతం పెరిగింది. బియ్యం ధర 10.5 శాతం, మినపప్పు, గోధుమపిండి ధరలు రెండూ 8 శాతం చొప్పున గత సంవత్సరకాలంలో పెరిగాయి. బియ్యం సగటు రిటైల్ ధర వచ్చి గురువారం నాటికి కిలో 41 రూపాయలు ఉంది. గత ఏడాది ఇదే బియ్యం ధర కిలో 37 రూపాయలుగా నమోదైంది. కందిపప్పు దేశీయ ఉత్పత్తి తగ్గడం వల్ల ధర పెరిగిందని మంత్రిత్వశాఖ పేర్కొంది. గత ఏడాది పంట కాలంలో కందిపప్పు 42.2 లక్షల టన్నులు పండితే, ఈ ఏడాది 34.3 లక్షల టన్నుల ఉత్తత్తి మాత్రమే జరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రైస్ మానిటరింగ్ సెల్ లెక్కలననుసరించి గురువారం నాడు కందిపప్పు సగటు రిటైల్ ధర కిలోకి 136 రూపాయలు ఉంది. గత ఏడాది దీని ధర కిలో 106.5 ఉంది. మినపప్పు విషయానికి వస్తే గురువారం నాటికి ఇది కిలో 114 రూపాయలు ఉంటే, గత ఏడాది దీని ధర కిలో 106.5 రూపాయలు. పెసరపప్పు వచ్చి కిలో ధర 102 రూపాయలు. కూరగాయల విషయానికి వస్తే అఖిల భారత స్థాయిలో బంగాళాదుంపల సగటు రిటైల్ ధర గత ఏడాది కన్నా 12 శాతం తగ్గింది. ఉల్లిపాయల ధర గత ఏడాది కన్నా 5 శాతం పెరిగిందని మంత్రిత్వశాఖ వెల్లడించింది. టొమాటో ధరల విషయానికి వస్తే ఇటీవల వారాల్లో వీటి ధర బాగా పెరగడానికి పలు అంశాలు కారణమని మంత్రిత్వశాఖ వివరించింది. వాటిల్లో పంట సీజనాలిటీ ఒక కారణం కాగా, కోలార్ లో వైట్ ఫ్లై జబ్బు వ్యాపించడం మరో కారణంగా పేర్కొంది. ఉత్తరభారతంలో హఠాత్తుగా సంభవించిన రుతుపవన వర్షాలు కూడా ఈ పరిస్థితికి మరో ముఖ్య కారణమని వెల్లడించింది. ఈ అనూహ్య వర్షాలతో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ వంటి చోట్ల టొమాటో పంట తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం గురువారం కిలో టొమాటో ధర 140 రూపాలయలుంటే, గత ఏడాది కిలో టొమాటోలు కేవలం 34 రూపాయలు మాత్రమే. అయితే ఉత్తరప్రదేశ్ లోని బులంద్షర్ లో టొమోటాల కిలో గరిష్ట ధర 257 రూపాయలుగా నమోదైతే, ఢిల్లీలో వీటి ధర కిలో 213 రూపాయలకు, ముంబయిలో కిలో 157 రూపాయలకు అమ్మారు.