
మూసీ బాధితులకు అండగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలకు నిరసనగా బీజేపీ చేపట్టిన మహాధర్నా లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యంశాలు..
“కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తి కావస్తున్నది. ఈ సమయంలో ఏ ఒక్క ఇంటికి భూమిపూజ, శంకుస్థాపన చేయలేదు. సోనియా, రాహుల్ నాయకత్వంలో ఒక్క పేదవారి ఇంటికి శంకుస్థాపన చేయకుండా తమ రక్తాన్ని చెమటగా మార్చి ఇటుకమీద ఇటుకపేర్చి నిర్మాణం చేసుకున్న పేదల గూళ్లను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు” అని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మూసీ ప్రాంతానికి వెళితే వారి కష్టాలు విని కడుపు తరుక్కుపోతుందని కిషన్ రెడ్డి అన్నారు. గత రెండు నెలలుగా ఆ నిరుపేదలందరికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కడుపు నిండా కూడా తినలేని పరిస్థితులో ఉన్నారని అన్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు. వీరందరికీ బీజేపీ అండగా నిలవాలని నిర్ణయించిందన్నారు.
దేశంలో, రాష్ర్టంలో, నగరంలో పేదవాడికి ఇబ్బంది వస్తే, మోదీ ఆదేశాలతో అండగా నిలబడతామని మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇళ్లు కట్టిస్తాం, మహిళలకు రూ. 2500, రైతులకు రుణమాఫి, రైతు కూలీలకు 12వేలు, పెన్షన్ లు పెంచుతాం, నిరుద్యోగులకు భృతి, రైతులకు సబ్సిడీ లాంటి అనేక రకాల హామీలను ఈ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఆరుగ్యారంటీల పేరుతో సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డిలు ప్రజలను మభ్యపెట్టి గ్యారంటీలను గారడీలుగా మార్చి మసిబూసి మారెడుకాయ చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాకుండా అడ్డుకున్నదో, తెలంగాణ ఉద్యమంలో 1500మంది బలిదానాలు చేసుకున్నారో అదే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉందో చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రభుత్వం కూడా ఇలాగే బీఆర్ ఎస్ మూసీ ప్రజలను భయపెట్టిందన్నారు. అప్పుడు కూడా బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల ఇళ్లను రక్షించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ బాటలోనే నడుస్తుందన్నారు. స్థానిక ఎంపీలు, పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్నారని అన్నారు.
మూసీ పారివాహాక ప్రాంతంలోని బాధితులందరినీ స్వయంగా వారిని కలిసి వారి ఆవేదన, ఆక్రోశం, కష్టాలు, కన్నీళ్లను చూశామన్నారు. మూసీ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నామన్నారు.మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు వ్యతిరేకం కాదన్నారు. కానీ పేద ప్రజల ఇళ్ల జోలికి వస్తే బీజేపీ అడ్డుకుంటుందన్నారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి సుందరీకరణ చేపట్టాలన్నారు. పేద ప్రజలు ఆ వాసనలోనే ఉండాలని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనేక సంవత్సరాల నుంచి ఉన్న ఇళ్లను ఏ రకంగా కూలుస్తారని ప్రశ్నించారు. మూసీ పారివాహక ప్రాంతం చరిత్ర సీఎం రేవంత్ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. మూసీలో అనేక ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు కలుస్తుందన్నారు. కుత్బుల్లాపూర్, బాలానగర్, మల్కాజ్ గిరి ఇలా అనేక ప్రాంతాల నుంచి మూసీలో నీరు కలుస్తుందన్నారు. దాన్ని డైవర్ట్ చేయకుండా ఎస్టీపీలు నిర్మాణం చేయకుండా మూసీ ప్రక్షాళన చేయలేరన్నారు.

హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలన్నారు. ముందుగా పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించి ఆ తరువాత మూసీ సుందరీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జీహెచ్ ఎంసీకి రూపాయి రాల్చే దిక్కు దివానం లేదు, డ్రైనేజీ వ్యవస్థ, విధి లైట్లు సరిచేసే దిక్కులేదన్నారు. ఆ కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్నారు. కనీసం కాలిపోయిన బల్బులకు డబ్బులేవన్నారు.మూసి ప్రాంతంలో బస్సు డిపో, మెట్రో కార్యాలయాన్ని ఏ విధంగా చేశారని ప్రశ్నించారు. అనేక ప్రాంతాలలో ఈ సమస్య ఉందన్నారు. పెద్ద పెద్ద వ్యాపారులు రియల్ ఎస్టేట్ విల్లాలు కడుతున్నారని, ఫాంహౌస్ లు కట్టుకుంటే వాటి గురించే మాట్లాడరని అన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని మూసీ ప్రాంత వాసుల మీద కాంగ్రెస్ ప్రతాపం ఏంటని నిలదీశారు.
మరోమారు సోనియా, రాహుల్, సీఎం రేవంత్ రెడ్డిలకు మనవి చేస్తున్నానని అన్నారు. హైదరాబాద్ లో పేదలు ఏ రకంగా వీరి ఆధ్వర్యంలో ఇబ్బందులకు గురవుతున్నారో? చూడాలని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఎక్కడకు పోయింది. ఏ దిశలో కూడా ఈ ప్రభుత్వం ఒక దిశ దశ లేకుండా పరిపాలన కొనసాగిస్తుంది.ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఆలోచన లేదు. తెలంగాణ పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి.రూ. 25వేలు ఇస్తున్నాం ఖాళీ చేయడానికి ఏమైందని అంటున్నారు. 40, 50 యేళ్లుగా తమ శ్రమతో కట్టుకున్న ఇళ్లు కాలి చేయాలంటే ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలన్నారు. పేదలెవ్వరూ ఆందోళన చెందవద్దని అన్నారు.
పిడికిలి బిగించి భారతీయ జనతా పార్టీతో కలిసి తెగించి పోరాడుదాం. మూసీ పారివాహాక ప్రాంత వాసులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు.భయపడాల్సిన అవసరం లేదు. తాను ఎక్కడకు వెళ్లినా ఈ వార్త విని ఆ ఆందోళనతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ విషయంపై చివరి వరకూ పోరాడుతామన్నారు. అన్ని రకాల పోరాటాలకు సిద్ధంగా ఉంటామన్నారు. మూసీ బాధితులకు అండగా ఉంటూ రాత్రి వరకూ కూడా ధర్నా కొనసాగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి, ఎంపీ బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాజేశ్వర్ రెడ్డి, కామారెడ్డి శాసనసభ్యులు కోటిపల్లి వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే హరీష్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన వారికి, మూసీబాధితులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.