
నన్ను సంపుకుంటారో.. సాదుకుంటారో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏఐసీసీకి లేఖ రాశారు. తన అనుంగు అనుచరుడు గంగారెడ్డి హత్య తర్వాత జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన నియోజక వర్గంలో తన అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీలోకి ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను (ముఖ్యంగా బీఆర్ఎస్) చేర్చుకోవడం పట్ల ఆయన అప్పట్లోనే సీరియస్ అయ్యారు. ఏఐసీసీ అనుమతితోనే చేరికలు జరుగుతున్నాయని పీసీసీ బుజ్జగించడంతో ఆయన శాంతించారు.
కానీ వేరే పార్టీ నుంచి వచ్చినవారే తన అనుచరున్ని హతమార్చడం ఆయన జీర్ణించుకోలేక పోతున్నాను. పార్టీలో కొనసాగాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. ఈ నేపథయంలో ఆయన రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.
రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోకు విరుద్ధంగా రాష్ట్ర పార్టీలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనీ ఆయన లేఖలో ఆరోపించారు. మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చాక పది మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం అవసరమా అని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ, లోకసభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీలకు ఆయన లేఖలు రాశారు. వీటి కాపీలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు పంపారు.
బీఆర్ఎస్ నుంచి వచ్చిన పోచారం శ్రీనివాస రెడ్డికి సలహాదారు పదవి ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. పోచారం ఎవరు పార్టీ ఫిరాయించాలో సలహాలు ఇస్తున్నారని విమర్శించారు.తీవ్రమైన మానసిక వ్యధ, ఆందోళనతో కూడిన బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్నానని ఆయన అన్నారు. తన రాజకీయ భవిష్యత్ ను అధిష్టానమే నిర్ణయించాలని జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.