
దండు మల్కాపూర్ లోని టిఫ్ MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో కొత్తగా ఏర్పాటైన ఎన్విరో ఫ్లూయిడ్స్ (ENVIRO FLUIDS) పరిశ్రమను TGIIC (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి నేడు అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అభివృద్ధి చేసిన టిఫ్ MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను, అందులో ఏర్పాటైన పరిశ్రమలను TGIIC చైర్ పర్సన్ సందర్శించారు. అనంతరం వివిధ పారిశ్రామిక వాడల నుండి వచ్చిన ప్రతినిధులతో, పారిశ్రామికవేత్తలతో నిర్మల సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా టిఫ్ MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు నేపథ్యాన్ని, అభివృద్ధిని, పారిశ్రామిక ప్రాంత అవసరాలను టిఫ్ రాష్ట్ర అధ్యక్షలు సుధీర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా TGIIC చైర్ పర్సన్ కు వివరించారు.
టిఫ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో జరిగిన అభివృద్ధిని, మౌలిక వసతులను చూసి తాను ఆశ్చర్యపోయానని, ఈ పార్క్ అభివృద్ధికి శ్రమించిన టిఫ్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ పారిశ్రామిక ప్రాంతానికి కావలసిన నీటి సరఫరా, 132 KV సబ్ స్టేషన్, పార్క్ లోపలికి రవాణా సదుపాయం, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ వంటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా నిర్మల వాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో టిఫ్ రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ రెడ్డి, ఇంచార్జి సెక్రటరీ గోపాల్ రావు, TGIIC యాదాద్రి జోనల్ మేనేజర్ సంతోష్, చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఫేస్ 2 అధ్యక్షులు గోవింద రెడ్డి, గాంధీనగర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామి గౌడ్, కాప్రా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు యాదయ్య, చెర్లపల్లి ఐలా సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి, కళా రమేష్, తాటి శ్రీనివాస్, ఎన్విరో ఫ్లూయిడ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవి నాయక్ తో పాటు వివిధ పారిశ్రామిక ప్రాంతాల పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.