
వరంగల్ లోని ఉర్సు గుట్టలో ‘సిమ్ అండ్ సామ్స్’ పార్టీ అండ్ ప్లే టౌన్” గేమింగ్ జోన్ ను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడికి చేరుకున్న మంత్రికి వేదపండితులు మంత్రోచ్ఛారణతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సురేఖ రిబ్బన్ కట్ చేసి గేమింగ్ జోన్ ను ప్రారంభించి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. గేమింగ్ జోన్ లోని ఆటల వివరాలను తెలుసుకుని, తాను ఆటలు ఆడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను మంత్రి గుర్తు తెచ్చుకున్నారు.
ఆటల వివరాలు, డిస్కౌంట్ కార్డులు, ఫుడ్, అందిస్తున్న సౌకర్యాల పై నిర్వాహకులు మంత్రి కొండా సురేఖకి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సిమ్ అండ్ సామ్స్ పార్టీ అండ్ ప్లే టౌన్ గేమింగ్ జోన్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. నేటి పోటీ యుగంలో శారీరక శ్రమకు ప్రాధాన్యత రోజు రోజుకీ పెరుగుతున్న తరుణంలో గేమింగ్ జోన్ ను ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అన్నారు. పిల్లలు సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్న ఈ రోజుల్లో వారికి ఆటలు చాలా అవసరమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆటల ద్వారా పిల్లల్లో గెలుపోటములను సమానంగా తీసుకునే పరిణతి కలుగుతుందని తెలిపారు. పిల్లలతో బాటు వచ్చే వారి తల్లిదండ్రులకు సమయం వృధా కాకుండా శారీరక వ్యాయమానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం వల్ల ఈ గేమింగ్ జోన్ కు ఆదరణ పెరుగుతుందని అన్నారు.