
*గుస్సాడీ నే తన ఇంటి పేరుగా మార్చుకున్న ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు, గురువు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తీవ్ర సంతాపం వ్యక్తపరిచారు.
కనకరాజు మృతితో గుస్సాడీ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన విలక్షణమైన కళాకారుడుగా కనకరాజు తన పేరును సుసంపన్నం చేసుకున్నారని సీతక్క అభిప్రాయపడ్డారు. కనకరాజు లేకుండా గుస్సాడీ నృత్యాన్ని ఊహించుకోవడం కష్టమన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు వందల గుస్సాడీ ప్రదర్శనలు ఇవ్వడమే గాక ఎంతోమందికి గుస్సాడీ నృత్యం నేర్పించిన ఆయన సేవలను సీతక్క గుర్తు చేసుకున్నారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపిన మంత్రి సీతక్క, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.