కర్నాటకలోని జైళ్లన్నీ ఖైదీలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న54 జైళ్లల్లో 66 శాతం జైళ్లు నూరు శాతం పైగా ఆక్యుపెన్సీతో జామ్ ప్యాక్డ్ గా ఉంటే, మరికొన్నింటిలో 258 శాతం దాకా ఖైదీలు ఉన్నారు. మరోవైపు జైళ్ల విభాగంలో సిబ్బంది లోటు కూడా 26 శాతం దాకా ఉండి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ సమాచారాన్ని సాక్షాత్తు హోమ్ డిపర్టుమెంటు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో తొమ్మిది కేంద్ర కారాగారాలు, 23 తాలూకా సబ్ జైల్స్, ఒక ఓపన్ జైలు ఉన్నాయి. నిజానికి ఇవి 14,237 ఖైదీలకు మాత్రమే ఉద్దేశించినవి. కానీ జూలై నాటికి ఇవన్నీ మొత్తం 16,053 మందిఖైదీలతో నిండిపోయాయి. అంటే జైలు సాధారణ గరిష్ట సామర్థ్యానికి మించి అంటే 13 శాతం పైగా ఖైదీలు వీటిల్లో ఉన్నారు. అన్నింటిలోకి బెంగళూరు కేంద్ర కారాగారం భారీగా ఖైదీలతో కిక్కిరిసిపోయింది. నిజానికి దీన్ని 4,146 ఖైదీలకు మాత్రమే సరిపడేలా నిర్మిస్తే, ప్రస్తుతం అందులో 5,261 మంది ఖైదీలు ఉన్నారు. అన్నింటిలోకి మైసూరు కేంద్ర కారాగార పరిస్థితి కొంత నయమనిపిస్తుంది. దాని గరిష్ట సామర్థ్యం 562 అయితే ప్రస్తుతం అందులో ఉన్న ఖైదీలు 835 మంది. శివమొగ్గ కేంద్ర కారాగారం రాష్ట్రంలో మూడవ పెద్ద జైలు. దీన్ని500 మంది ఖైదీలకు ఉద్దేశించి నిర్మిస్తే, ప్రస్తుతం అందులో 700 మంది ఖైదీలు ఉన్నారు. రాష్ట్రంలోని 54 జైళ్లల్లో 20 జైళ్లల్లో నూరు శాతం కంటే తక్కువ ఖైదీలు ఉంటే, ఏడు జైళ్లల్లో 81 శాతం నుంచి 98 శాతం వరకూ ఉన్నారు. మిగతా జైళ్లల్లో 20 శాతం నుంచి 80 శాతం మంది ఖైదీలు మగ్గుతున్నారు. తిప్తూరులో ఉన్న జైలుకు బాగులు చేస్తుండడంతో ప్రస్తుతం అది ఖాళీగా ఉంది.
కర్నాటకలోని జైళ్లల్లో సిబ్బంది లోటు కూడా ఎక్కువగానే ఉందని హోం డిపర్టుమెంటు ప్రత్యేక గణాంకాల వివరాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఆ గణాంకాల ప్రకారం 4,000 పోస్టులు ఉంటే వాటిల్లో వెయ్యి పోస్టులు పైగా ఖాళీగా పడున్నాయి. వీటిల్లో చాలా వరకూ ఆబ్జర్వర్స్, నర్సులు, డ్రైవర్సు పోస్టులకు సంబంధించినవే. ఈ ఖాళీలు 50 శాతం పైగానే ఉన్నాయి. ఈ రెండు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిచవలసి ఉంది. ముఖ్యంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నవాటిల్లో జైళ్ల శాఖ కూడా ఉంది. ఈ పరిస్థితి అవాంచనీయం. జైళ్లల్లో సిబ్బంది లోటు వల్ల ఉన్న సిబ్బందిపైనే పనిభారం తీవ్రంగా పడుతోంది. ఈ సమస్య పరిష్కారంలో భాగంగా కొత్త కారాగారాలను నిర్మించాలన్న నిర్ణయానికి కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అంతేకాదు అదనపు బ్యారక్ లను నిర్మించాలని కూడా అనుకుంటోంది. వెయ్యిమంది ఖైదీలు పట్టే కొత్త కేంద్ర కారాగారాలను మంగళూరు, బిదర్, విజయపురాల్లో నిర్మిస్తోంది. అలాగే విరాజ్ పేట్, అర్సికేరా తాలూకాల్లో రెండు సబ్ జైళ్లను కూడా కడుతోంది. వీటిలో మొదటి సబ్ జైలు 50 మంది ఖైదీలకి సరిపడేలా ఉంటే, రెండవ సబ్ జైలు 80 మంది ఖైదీలకు సరిపడే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు.