

CM Revanth reddy handING over Kalehwaram episode to CBI shocked Telangana people: కాళేశ్వరం విచారణను తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ సీబీఐకి అప్పజెప్పి చేతులు దులుపుకున్నట్లే కనిపిస్తున్నది. ఆదివారం (అక్టోబర్ 31) అర్థరాత్రి దాటే వరకు జరిగిన వాడివేడి చర్చ చివరకు ఇలా ముగియడం చాలా మందిని ఆశ్చర్యానికి లోను చేసింది. కాళేశ్వరంలో తప్పు ఎవరిదో తేలుస్తారనీ, శిక్షార్హులైన వారి విషయంలో ఏదో ఒక చర్య ఉంటుందని భావించిన జనం సర్కారు నిర్ణయం చూసి ముక్కు మీద వేలేసుకోవాల్సి వచ్చింది. కాళేశ్వరంపై చర్చ కోసం రాత్రి తెల్లవార్లూ సభ జరుగుతూ ఉంటే అంతా ఏదో జరగబోతుందని ఉత్కంఠగా గమనిస్తూ వచ్చారు. కానీ చివరకీ ఆ చర్చ.. అంతు తేలుతుందో లేదో తెలియని సీబీఐ చేతికి వెళ్లడంతో నిట్టూర్చడం మినహా ఏమీ చేయలేని స్థితి ఏర్పడింది.
ఎందుకిలా చేశారు?
నోరు తెరిస్తే కేసీఆర్‌పై, కాళేశ్వరంపై విరుచుకుపడే రేవంత్ రెడ్డి, ఆయన సహచరులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమిటీ అని రాత్రంతా నిద్ర లేకుండా అసెంబ్లీ పరిణామాలను ఫాలో అయిన జనం ఎందుకిలా జరిగిందని తెల్లారే దాకా చర్చలు చేస్తూ కూర్చుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన తప్పులకు కేసీఆరే నిర్ణయాలే కారణమని పీసీ ఘోష్ కమిషన్ స్పష్టంగా చెప్పినా రేవంత్ సర్కార్ ఆయనపై చర్యలకు ఎందుకు వెనకాడింది? ఏ అనుమానాలు సీఎం రేవంత్, ఆయన సహచరుల మనసులో ఉన్నాయి? చర్యలు చేపట్టే అధికారం లేదనుకున్నారా? రేవంత్ చేసిన ఈ పని వల్ల లాభపడే వారెవరు? ఇది కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందా, బీజేపీకి అడ్వాంటేజ్, బీఆర్ఎస్కు కలిసొస్తుందా అని రకరకాల చర్చలు జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం వ్యవహారం అతి పెద్ద నేరపూరిత చర్య అని భావించిన రేవంత్ తన చేతిలకు మట్టి అంటకుండా కేంద్రం కోర్టులోకి బాల్ తోశారా? సీబీఐ విచారణ తర్వాత కేసీఆర్ దోషి అని తేలితే (తేలుతుందని నమ్మి) వాళ్లే ఆయనను అరెస్టు చేస్తే తమకు కలిసి వస్తుందనుకున్నారా? నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఘోష్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలకు పూనుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అట్లాంటపుడు ఆయన ఆ పని ఎందుకు చేయలేదు లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కేసీఆర్‌కు సానుభూతి వస్తుందనా?
కేసీఆర్‌పై పీకల దాకా కోపం ఉన్న రేవంత్ ఎందుకు అతి జాగ్రత్త పడ్డట్లు? తాము అరెస్టు చేస్తే కేసీఆర్‌కు సానుభూతి వస్తుందని ఏదైనా అనుమానం రేవంత్ సర్కారుకు ఉందా? కేసీఆర్ మీద తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్‌ను గెలిపించారు. కాంగ్రెస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రం సాకారమైనా కేసీఆర్ హయాంలో తమ ఆకాంక్షలు నెరవేరనందుకు ప్రజలు ఆయన మీద ఎంతో కోపంతో ఉండి, ఓడించారు. కారణమేదైనా కాంగ్రెస్ సర్కారుపై కొద్ది నెలల కాలంలోనే పెదవి విరుపు మొదలైంది. కేసీఆర్ లంకె బిందలు వదిలిపెట్టి పోయారనుకుంటే ఖాళీ కుండలు మాత్రమే మిగిల్చారని రేవంత్ ఎంతగా చెప్పాలని ప్రయత్నించినప్పటికీ అది జనానికి ఎక్కలేదు. తమ నిత్య జీవన సమస్యలు, వాటి పరిష్కారమే వాళ్లకు ముఖ్యమయ్యాయి. రైతు రుణమాఫీ, రైతు బంధు కాంగ్రెస్‌పై తొట్టతొటి వ్యతిరేకతకు కారణమైంది. ఎంత సొమ్ము ఇచ్చామని చెప్పినా ఏ ఊరికి వెళ్లి కదిలించినా స్పష్టంగా లోపాలు బయటపడతాయి. కాంగ్రెస్ సర్కారు ఎందరు ఎన్ని చెప్పినా ఏదో ముసుగు మాటున వాటిని దాచేస్తూ వచ్చారు, వస్తున్నారు. ఎండా కాలంలో సాగు నీటికి ఇబ్బంది పడ్డ రైతులకు ఇపుడు యూరియా సమస్య ముఖ్యమైపోయింది. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు భారీ వర్షాల కారణంగా పంట నష్టం దానికి తోడైంది. ఈ సమస్యలన్నింటిపై అన్ని రకాల అవకాశాలను వినియోగించుకొని బీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తూ వస్తోంది. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్‌కు ఊపరి సలపనీయకుండా అన్ని మార్గాల్లో ఎటాక్ మొదలుపెట్టింది. మొన్నటి దాకా బీఆర్ఎస్ నేతల మొహం కూడా చూడడానికి ఇష్టపడని జనం ఇపుడు నెమ్మెదిగా వాళ్ల వైపు పరికించి చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను ముట్టుకోవడానికి రేవంత్ సర్కార్ వెనకాడిందా అనే సందేహం వ్యక్తమవుతోంది.

రాజకీయంగా ఎవరికి లాభం?
ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో ఈ మొత్తం వ్యవహారం ఎవరికి కలిసి వస్తుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. కాళేశ్వరం అంశానికి కేంద్ర విచారణ సంస్థ అయిన సీబీఐకి అప్పజెప్పడం వల్ల బీజేపీ ఇరకాటంలో పడుతుందా? విచారణను వేగవంతం చేయించి కేసీఆర్‌పై చర్యలు తీసుకోకపోవడం వల్ల బద్నామ్ అవుతుందా? అపుడు కాంగ్రెస్ నెపాన్ని బీజేపీపై నెట్టి రాజకీయంగా లాభపడాలని చూస్తున్నదా అనే చర్చ ఒకటి సాగుతోంది. అంతేకాక కేసీఆర్‌పై చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ రెండు పార్టీలు మిలాఖత్ అయ్యాయని ప్రజల్లో ప్రచారం చేసి రాజకీయంగా లబ్ది పొందాలని అనుకుంటోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోపక్క బీజేపీయే దీన్ని అడ్వాంటేజ్‌గా మార్చుకుంటుందనీ, బీఆర్ఎస్ నేతల్ని ఇరకాటంలో పెట్టి రాష్ట్రంలో బలోపేతం అవుతుందని కొందరు వాదిస్తున్నారు. కేసుల పేరిట బీఆర్ఎస్ నేతల్ని బెదిరింపులకు గురి చేసి వాళ్లను తన వైపుకు తిప్పుకునే అవకాశం ఉందనీ, ఎన్నో రాష్ట్రాల్లో ఈ పని చేసిందని చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్పై వల విసురుతుందనీ, లేదా ఎన్నికల సమయానికి పరిస్థితులను బట్టి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవచ్చుననే వాగ్వాదాలు సాగుతున్నాయి. మరోపక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ డొల్లతనం బయటపడ్డదనీ, కేసీఆర్‌పై నిప్పులు కక్కిన నేతలు తుస్సుమన్నారనీ, కాంగ్రెస్ మరింత పదునైన దాడిని ఎక్కుపెడతారని కొందరు భావిస్తున్నారు. సీబీఐ ఎంక్వయిరీకి బీజేపీ నేతలే డిమాండ్ చేయడంతో రేవంత్ సర్కార్ నిర్ణయంతో బాల్ వాళ్ల కోర్టులోకి వెళ్లిపోయింది. సీబీఐ విచారణ ఒకటి రెండు రోజుల్లో తేలే అంశం కాదని అందరికీ తెలిసిందే. ఈ జాప్యంతో కాంగ్రెస్, బీజేపీలపై ఏకకాలంలో దాడి చేసే అవకాశం బీఆర్ఎస్కు వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

కాళేశ్వరం కథ కంచికేనా?
మొత్తం మీద ఈ రాజకీయ పచ్చీస్లో జనం మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. ఎన్నికల సమయంలో నిర్ణయాధికారం తమ చేతుల్లో ఉందని గర్వపడ్డ జనం ఇపుడు చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితిలోకి నెట్టబడ్డారు. కాళేశ్వరంలో ఎవరు కాలు జారారో, ఎవరు ఎవరికి చేయందిస్తున్నారో, ఎవర్ని ముంచుతారో, ఎవర్ని పెంచుతారో అర్థం కాక ఆలోచనలో పడ్డారు. కాళేశ్వరం విచారణ తేలుతుందా, మేడిగడ్డ బాగవుతుందా, తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తారా, తమ పంటలు పండుతాయా అన్న విషయాలు తేలక సందేహంలో ఉన్నారు. ఏది జరిగినా భారమంతా మోయాల్సింది జనమే కదా!