
*ఇవాళ చంద్రునిపై దిగనున్న చంద్రయాన్ 3 – సర్వత్రా ఉత్కంఠ*
భారత్ చంద్రయాన్-3 ప్రయోగంపై యావత్ ప్రపంచం దృష్టి సారించింది. నరాలు తెగే ఉత్కంఠతో ఉంది. చంద్రుడిపై ల్యాండింగ్ మాడ్యూల్ విక్రమ్ ను సేఫ్ గా దించేందుకు ఇస్రో సర్వ సన్నద్ధం ఐంది. ఈ మిషన్ సక్సెస్ ద్వారా జాబిల్లిపై ల్యాండర్ రోవర్‌ను దించిన అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్ నిలుస్తుంది. ఐతే, ఇంత వరకూ ఏ దేశం కూడా చందమామ దక్షిణధృవంపై కాలు మోపలేదు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఆ ఘనకీర్తి ఒక్క భారత్ కే దక్కుతుంది. ఈ మహోన్నత ఘట్టాన్ని సక్సెస్ చేయాలని సైంటిస్టులు పట్టుదలతో ఉన్నారు.
*చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ విశేషాలు*
ల్యాండర్ చంద్రయాన్ 2, 3 ఆర్బిటర్ మాడ్యూల్స్ తోపాటు నేరుగా భూమి మీద బేస్ స్టేషన్ తోనూ ల్యాండర్ కమ్యూనికేషన్ సాగించగలదు. రోవర్ కేవలం ల్యాండర్ తోనే అనుసంధానమై ఉంటుంది. సౌత్ పోల్‌లో కొన్ని శాశ్వతంగా చీకట్లో ఉండే ప్రదేశాలు ఉన్నాయి. విక్రమ్ ల్యాండర్ సూర్యరశ్మి ఉండే ప్రదేశంలోనే దిగుతుంది. ల్యాండర్, రోవర్ పని చేయాలంటే సోలార్ పవరే ఆధారం. ల్యాండ్ అయిన 4 గంటల తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ బయటకొస్తుంది.
*4 దశల్లో వ్యోమనౌక ల్యాండింగ్*
రఫ్ బ్రేకింగ్: గంటకు 6048 కి.మీలు ఉన్న వేగాన్ని 4 థ్రస్టర్ ఇంజిన్లతో తగ్గిస్తారు.
ఆల్టిట్యూడ్ హోల్డ్: నౌక దృక్కోణాన్ని 50° లకు మార్చుకుని గమ్యం దూరాన్ని విశ్లేషిస్తుంది.
ఫైన్ బ్రేకింగ్: వేగం సున్నా. 800 మీ. ఎత్తులో నుంచి ల్యాండింగ్ ప్రదేశం పరిశీలిస్తుంది.
టెర్మినల్ డిసెంట్: 150 మీ. ఎత్తుకు చేరి ఉపరితలాన్ని పరిశీలిస్తుంది. రాళ్లు ఉంటే ప్రత్యామ్నాయ ప్రదేశానికి వెళ్లి ల్యాండ్ అవుతుంది.
*చంద్రుని సమాచారం చేరుతుందిలా*
చంద్రయాన్ 3 లోని ల్యాండర్ మూన్ రెగోలిత్ సర్ఫేస్ మీద దిగిన తర్వాత దాని నుంచి రోవర్ బయటకొస్తుంది. ఇది జాబిల్లి మీద తిరుగుతూ ఉపరితలాన్ని విశ్లేషిస్తుంది. ఆ సమాచారం దగ్గరలోని ల్యాండర్ కు పంపుతుంది. ల్యాండర్ తాను సేకరించిన సమాచారాన్ని 100 కి.మీ దూరంలో పైన కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్ 2 ఆర్బిటర్ కు పంపుతుంది. అక్కడి నుంచి ఇస్రో బేస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ చేరుతుంది.
*చంద్రయాన్ 3 ప్రయోగం ఎందుకంటే?*
₹ 615 కోట్లతో చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంతో చంద్రుని పుట్టుక రహస్యాలు తెలిసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా చందమామపై దిగే రోవర్, ల్యాండర్లు చాలా ప్రయోగాలు చేసి ఇస్రో నిర్దేశించిన లక్ష్యాలు సాధించాల్సి ఉంటుంది. చంద్రుని ఉపరితల శోధన, వాతావరణం, నీటి లభ్యత, ఖనిజాల పరిశీలన, మూలకాల లభ్యత వాటిలో ముఖ్యమైనవి. ఇవి లూనార్ సర్ఫేస్ ఫోటోలు తీసి 3D మ్యాపింగ్ కూడా చేస్తాయి.