
కాంగ్రెస్‌లో విలీనం
వైఎస్ షర్మిల్ తెలంగాణలో స్థాపించిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ విలీనం చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయపరమైన గ్యాప్ ఉందనీ, ఒక కొత్త పార్టీ అవసరమని ప్రకటించి షర్మిల పార్టీ పెట్టారు. కేసీఆర్ విధానాలను ప్రశ్నించే వారు లేరనీ, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడం లేదని అప్పట్లో ఆమె చెప్పారు. తెలంగాణలో వైఎస్సార్ ఆశయాలను అమలు చేస్తానని పార్టీ పెట్టినప్పుడు చెప్పారు. అయితే కాలక్రమంలో మారిన రాజకీయ పరిణామాలలో ఆ పార్టీ తెలంగాణలో పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆంధ్రాలో అన్నతో పోరాటం చేయకుండా తెలంగాణకు రావడం ఏమిటని ఆమెపై తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. కుటుంబంలో కలహాల నేపథ్యంలో ఆమె తెలంగాణకు వచ్చారన్నారు. వైఎస్సార్ తెలంగాణ వ్యతిరేకి అనీ, ఆమె కూతురు ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఎలా ఇక్కడి ప్రజలు ఎలా నమ్ముతారని కొందరు నాయకులు ప్రశ్నించారు. షర్మిల విమర్శలన్నింటికీ సమాధానాలు చెప్పినప్పటికీ ఆ పార్టీ ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు.
పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 3.800 కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేశారు. వైస్సాఆర్ కూతురిగా ఈ యాత్ర సందర్భంగా ఆమెకు ఆదరణ లభించినప్పటికీ రాజకీయంగా ఆమె ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. షర్మిల అంచనా ప్రకారం తెలంగాణలో వైఎస్సాఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారనీ, రాజకీయంగా తటస్థంగా ఉన్న వారికీ, రాజకీయ నిరుద్యోగులకు తన పార్టీ అడ్డా అవుతుందని భావించారు. కానీ కొద్ది కాలానికి అది భ్రమే అని ఆమెకు అవగతమవుతూ వచ్చింది. వైఎస్సాఆర్ టీపీ వైపు నాయకులు పెద్దగా ఆకర్శితులు కాలేదు.
దీనికి తోడు షర్మిల వన్వుమెన్ షో కూడా చాలా మంది నేతలకు నచ్చలేదు. ఈ పార్టీలో ఉంటే అనామకంగానే మిగిలిపోవాల్సి వస్తుందని అభిప్రాయానికి వచ్చారు. పాదయాత్రలు చేసినా, ఆందోళన కార్యక్రమం తీసుకున్నా, మీడియాతో మాట్లాడినా షర్మిల మాత్రమే ఫోకస్ అయ్యేలా చూసేవారు. ఇతర నేతలకు ప్రాధాన్యత లభించేది కాదు. దాంతో తొలుత పార్టీలో చేరిన నేతలు తర్వాత దూరమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ కార్యక్రమాలకు నేతలు, కార్యకర్తలు లేక షర్మిల ఏదైనా ప్రోగ్రామ్‌కు పిలుపు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది.
ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని తొలుత భావించారు. కాంగ్రెస్ నేతలను కలిస్తే పొత్తుకన్నా పార్టీని విలీనం చేయమనే ప్రతిపాదన పెట్టారు. దీనిపై సుదీర్ఘ సమాలోచన జరిగింది. తొలుత పార్టీని విలీనం చేసేందుకు సుముఖంగా లేని షర్మిల మారిన పరిస్థితులు చూసి అదే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఇంకా బలమైన శక్తిగానే ఉంది. నిన్న మొన్నటి వరకు రెండో ప్రత్యర్థిగా కనిపించిన బీజేపీ కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత వీక్ అయ్యింది. కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతూ వస్తోంది. బీఆర్ఎస్కు గట్టి పోటీనిచ్చే పార్టీగా మారింది. ఇలాంటి తరుణంలో మరో పార్టీగా వైస్సాఆర్టీపీకి స్పేస్ పెద్దగా లేదని అర్థం చేసుకున్న షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే బెటర్‌గా భావించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విలీనానికి ఫార్మూలా ఏమిటీ?
వైస్సాఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల కాంగ్రెస్‌కు ఏం షరతులు పెట్టారనేది ఇపుడు ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో 40 సీట్లలో తమకు బలం ఉందని కేంద్ర సర్వేలు చెబుతున్నాయని షర్మిల ఆ మధ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె తమ ప్రతినిధులకు సీట్లు కేటాయించాలనే షరతు పెట్టారా అనేది చర్చనీయాంశం అయ్యింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు మాత్రమే ఒక సీటు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరు లేదా సికింద్రాబాద్ సీటు నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. కాగా పార్టీలో ఆమెకు ఎలాంటి పదవి ఇస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
రేవంత్‌తో పొసుగుతుందా?
పార్టీ పెట్టిన తొలి నాళ్లలో షర్మిల పీసీసీ చీఫ్ రేవంత్‌పై ఘాటు విమర్శలే చేశారు. ఆయన కిరాయి నాయకుడనీ, చంద్రబాబు ఏజెంట్ అని అన్నారు. రేవంత్ కూడా షర్మిలది రాజకీయ పార్టీ కాదనీ, ఆమెది ఎన్జీవో అని కొట్టి పారేశారు. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. షర్మిల కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న క్రమంలో ఆ విషయం గురించి రేవంత్‌ను మీడియా ఎప్పుడు ప్రశ్నించినా పెద్దగా స్పందించేవారు కాదు. కానీ కర్నాటక ఎన్నికల తర్వాత షర్మిల, డీకే శివకుమార్‌ను కలిసిన తర్వాత మాత్రం తమ పార్టీలోకి ఎవరైనా రావొచ్చునన్నారు. షర్మిల వచ్చినా ఆంధ్రాకు వెళ్తుందన్నారు. ఇపుడు షర్మిల ఆంధ్రాకు వెళ్తుందా, తెలంగాణకు పరిమితమవుతారా అనేది ఆసక్తిగా మారింది. షర్మిల మాత్రమే తెలంగాణలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రచార కమిటీ బాధ్యతలు ఇస్తారా, ఏఐసీసీ స్థాయిలో ఏదైనా పదవి ఇస్తారా అనేది వేచి చూడాల్సిన పరిణామంగా ఉంది.