
జులై 31న గద్దర్ మీడియాకు చివరి ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నోట్ రాశారు. తాను ఉత్సాహాంగా తిరిగి వస్తానని ఆయన రాసిన ఆఖరి మాటలు ఇపుడు అందరి మనసులు కలిచి వేస్తున్నాయి.
‘‘గుమ్మడి విఠల్ నా పేరు. గద్దర్ నా పాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయసు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయసు 25 సంవత్సరాలు. నా పేరు జనం గుండె చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్స కోసం బేగంపేటలోని శ్యామకరణ్ రోడ్డులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో చేరాను. జూలై 20 నుండి నేటి వరకూ అన్ని రకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుటపడుతున్నాను.
గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ డి.శేషగిరిరావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్. నర్సప్ప (అసెస్తీషియా), డాక్టర్ ప్రఫుల్ చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతోంది. గతంలో నాకు డాక్టర్ జీ.సూర్యప్రకాశ్ గారు, బి.సోమరాజుగారు వైద్యం చేశారు. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను..’’