
గద్దర్ అపోలోఆస్పత్రిలో నేడు కన్నుమూశారు. రెండురోజుల క్రితం ఆయన గుండెకు శస్త్రచికిత్స జరిగింది. తేరుకుంటారనుకున్న ఆయన గొంతు మూగపోయింది. అశేష ప్రజలను దు:ఖ సాగరంలో ముంచింది. ప్రజాగాయకుడుగా ప్రజల హృదయాలలో ఆయనది అపూర్వమైన స్థానం. గద్దర్ విప్లవ పార్టీ కార్యకర్త, రచయుత, గాయకుడు. దళిత రచయితగా అందరికీ బాగా ఎరిగిన ప్రజాకవి.
స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన ‘‘గదర్ పార్టీ’ స్ఫూర్తిగా గద్దర్ ఆ పేరును పెట్టుకున్నారు. మూడున్నర దశాబ్దాల విప్లవ జీవితం ఆయనది. వామపక్ష ఉద్యమాలలో ముఖ్య పాత్ర పోషించారు. అంతేకాదు సాంస్కృతిక ఉద్యమాల నుంచి గద్దర్‌ను విడదీసి చూడలేం. ఇక జననాట్యమండలి ఏర్పాటులో కూడా గద్దర్ కీలకపాత్ర పోషించారు. పాటనై వస్తున్నానమ్మ అంటూ ప్రజల గుండెల్లోకి దూసుకు వచ్చిన గద్దర్ గొంతు ఆగిపోవడం ఎందరినో కదిలిస్తుందనేది ఆయన పాటలంత సత్యం. తెలంగాణాలోని భూస్వామ్యధోరణులు, భూమి చుట్టూ అలుముకున్న జీవితాలు గద్దర్ని తీవ్రంగా కదిలించాయి. అవే ఆయన ప్రజల్లోకి పాటతో, బుర్రకథలతో వెళ్లేలా చేశాయి. తెలంగాణా తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో గద్దర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వామపక్ష భావజాలాన్ని తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లి అద్భుతమైన పాటల కెరటంగా ప్రజల గుండెల్లో నిలిచారు.
గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో జన్మించారు. నిజామాబాద్ జిల్లా మహబూబ్ నగర్ లో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాదులో ఇంజనీరింగ్ చేశారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన భార్య పేరు విమల. ఆయన చదువుకునే రోజుల్లోనే బుర్రకథ బృందాన్ని ఏర్పాటుచేశారు. గ్రామాల్లో బుర్రకథలు చెప్పేవారు. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో విప్లవాల పట్ల ఆయన ఆకర్షితులయ్యారు. అనంతరం అప్పటి పీపుల్స్ వార్ లో చేరారు. 1969నాటి తెలంగాణా ఉద్యమంలో ఆయన ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. బుర్రకథ మాధ్యమం
ద్వారా ప్రజలను ఎంతో చైతన్యవంతులను చేశారు. ప్రతి ఆదివారం గద్దర్ ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి. నరసింగరావు ప్రోత్సహంతో మొదటి పాట ‘‘ఆపర రిక్షా’’ రాశారు. ఆయన మొదటి ఆల్బమ్ పేరు గద్దర్. అదే ఆయన పేరుగా స్థిరపడిపోయింది. తన పాటల ద్వారా ఆయన స్పృశించని సామాజిక అంశాలు లేవు. కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక అంశాలపై బుర్రకథలను కట్టి ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో పలు సమస్యలపై అవగాహన పెంచారు.
పల్లెల్లోని అకృత్యాలను ఎదిరించేందుకు 1972లో జననాట్యమండలి ఏర్పడింది. దాని ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించారు. దళితులను చైతన్యం చేసేందుకు అది నడుంకట్టింది. తర్వాత అంటే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్ష రాసి కెనరా బ్యాంకులో క్లర్క్ గా చేరారు. తర్వాత పెళ్లి జరిగింది. ఆయనకు సూర్యుడు (సూర్యకిరణ్), చంద్రుడు (చంద్రకిరణ్) అనే ఇద్దరు కొడుకులు, వెన్నెల అనే కూతురు ఉన్నారు. (చిన్న కొడుకు 2003లో అనారోగ్యంతో మరణించారు) కాగా, 1984లో గద్దర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో దళితుల హత్యాకాండను నిరశిస్తూ తీవ్రంగా పోరాడారు. తర్వాత జననాట్యమండలిలో చేరి ఒగ్గు కథ, బుర్రకథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి తన పాటల సందేశాలతో చొచ్చుకుని వెళ్లారు.
పీపుల్స్ వార్ పార్టీపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించనిపుడు అజ్ఘాతంలో ఉండి జననాట్యమండలి సాంస్కృతికి కార్యక్రమాలను గద్దర్ రహస్యంగా నిర్వహించారు. అంతేకాదు అఖిల భారత విప్లవ విద్యార్థి సమాఖ్య, అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి వంటి ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లడంలో కూడా గద్దర్ ఎంతో కృషిచేశారు. 2010 లో పూర్తిస్థాయి విప్లవ జీవితం నుంచి ఆయన బయటకు వచ్చేశారు. తెలంగాణా మలిదశ ఉద్యమంలో తన పాటతో జనాలను తనదైన శైలిలో ఎంతో చైతన్యపరిచారు. కులవివక్ష, లింగ వివక్ష, పేదలపై అణచివేత, దోపిడీలు,భూస్వామ్య ధోరణులు వంటి అంశాలపై పాటలు రాసి, గజ్జ కట్టి నాట్యం చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. చైతన్యవంతులను చేశారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా పాటై నిలిచిపోయారు.