
మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పసి కందుల తారుమారు కలకలం సృష్టించింది. సుమిత్ర అనే మహిళకు పుట్టిన బాబును అదే ఆసుపత్రిలో డెలివరీ అయిన సునీతకు అప్పగించారు వైద్య సిబ్బంది. ఈ విషయాన్గంని సుమిత్ర కుటుంబ సభ్యులు గంట తర్వాత గుర్తించారు. వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దాంతో ఏం జరిగిందో చెక్ చేసుకున్న సిబ్బంది తమ తప్పు తెలుసుకున్నారు. దాంతో సునిత దగ్గరి నుంచి బాబును తీసుకొని సుమిత్రకు అప్పగించడంతో వివాదం సద్దుమణిగింది.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన భూక్య సుమిత్ర జూలై 31వ తేదీన మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయింది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. బాబు కు పసిరికలు కావడంతో ఎస్.ఎన్.సి.యు లోని బాక్స్ లో ఉంచారు. కేసముద్రం మండలం దస్రు తండా చెందిన సునిత ఈ నెల 4 వ తేదీన ప్రసూతి కాగా పాపకు జన్మనిచ్చింది. పాప కు శ్వాస సరిగా ఆడకపోవడం తో ఎస్.ఎన్. సి.యు లోని బాక్స్ లో ఉంచారు.బాబు కు ఫీడింగ్ ఇవ్వడం కోసం ఎస్ఎన్సియు లో నుండి సుమిత్ర బాబు ను సునిత కు ఇచ్చారు. బాబు ని తీసుకున్న సునిత కుటుంబ సభ్యులు వార్డుకు వచ్చారు. కొంత సమయం తర్వాత వార్డు లోని కొంత మంది మీకు పాప పుట్టింది కదా, బాబు ఎక్కడ నుండి వచ్చాడు అని ప్రశ్నించారు. ఈ విధంగా ప్రశ్నిస్తున్న సమయంలో సునిత వద్ద ఉన్న బాబు ను అమ్మమ్మ చూసి బాబు కు ఉన్న కాటుక బొట్టును నేనే పెట్టిన.. ఇతడు మా బాబే మీ దగ్గరికి ఎలా వచ్చాడు అని వారితో, సిబ్బంది తో వాగ్వాదానికి దిగింది. దీంతో తప్పును తెలుసుకున్న సిబ్బంది బాబును సుమిత్రకు అప్పగించారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని హామీని ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమనిగింది. విషయం తెలుసుకున్న బ్లూ కోట్స్ సిబ్బంది వెంటనే హాస్పిటల్ కు చేరుకుని విచారణ చేపట్టారు.