
సిద్దిపేటలో బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అందజేసిన సందర్భంగా మంత్రి తన్నీర్ హరీష్ రావు మాట్లాడుతూ కేసిఆర్ హయాంలో బీసీలకు వంద శాతం మేలు జరిగిందన్నారు. కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం తీసుకొచ్చామన్నారు. బ్యాంకుల ద్వారా షూరిటీ, గ్యారెంటీగా లేకుండా కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు ఒక లక్ష రూపాయల చెక్కుల పంపిణీ జరుగుతోందన్నారు.
బీసీ కుల వృత్తిదారులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో నాయి బ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటు ఇస్తున్నామన్నారు. గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ చేస్తున్నామని హరీష్ చెప్పారు. నేతన్నలకు 50 శాతం సబ్సిడీతో నూలు ఇచ్చి, వారు నేసిన వస్త్రాలను ప్రభుత్వ కొనుగోలు చేసేందుకు చేనేత మిత్ర కార్యక్రమం చేపట్టామని చెప్పారు. మత్స్యకారుల కోసం నీటి వనరులలో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నాం అన్నారు. 600 కోట్ల రూపాయలు వ్యయం చేసి మత్స్యకారులకు లూనాలు, మోపెడ్ల పంపిణీ చేశామన్నారు. గీత కార్మికులకు చెట్లు పన్ను మరియు పాత బకాయిల రద్దు, సొసైటీల పునరుద్ధరించమని చెప్పారు.
తెలంగాణ రాకముందు రాష్ట్రంలో మొత్తం 330 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండగా ప్రస్తుతం 1012 ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రతి ఒక్క మండలంలో ఒక బీసీ, ఒక ఎస్సీ, ప్రతి నియోజకవర్గనికి ఒక మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నామనీ తెలిపారు.