
కోకాపేట్ భూముల రికార్డు ధరల అమ్మకాల తర్వాత బుద్వేల్ భూముల వేలం జరుగుతోంది. గురువారం ఉదయం వేలం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుంది. వేలం ఆన్లైన్ పద్ధతిలో జరుగుతోంది. కోకాపేట భూములు కొనుగోలు చేసిన రియల్ సంస్థలే ఈ వేలంలోనూ పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 100 ఎకరాల్లో వున్న 14 ల్యాండ్ పార్సిళ్లను రెండు సెషన్లలో వేలం వేస్తున్నారు. ఒక్కో ఫ్లాట్ 3.47 ఎకరాల నుండి 14.33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రభుత్వం ఎకరానికి 20 కోట్ల రూపాయల ధర నిర్ణయించింది. వేలంలో అది 80 కోట్ల రూపాయల వరకు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫ్లాట్ల అమ్మకాల ద్వారా మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఓఆర్ఆర్కు అనుకొని వున్న బుద్వేల్ వెంచర్.. కోకాపేట, ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉండడం, పీవీ ఎక్స్ ప్రెస్ హైవేకు సమీపంలో ఉండడం కలిసొస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం 6రోజుల వ్యవధిలోనే బుద్వేల్ భూముల అమ్మకానికి సమయం విధించారు. హెచ్ఎండీఏ ఈనెల 4న నోటిఫికేషన్ ఇచ్చింది. 10న వేలం ప్రకటించింది.