తన వద్దకు వివిధ పనుల కోసం వచ్చే సందర్శకుల సౌకర్యార్థం ఆల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హనుమకొండ ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంత్రి వివిధ పనుల మీద పాలకుర్తి నియోజకవర్గం సహా పలు ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం శుక్రవారం ఆల్పాహారాన్ని స్వయంగా వడ్డించి, ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గం నుంచే గాక, వివిధ పనులపై అనేక మంది తన వద్దకు వస్తున్నారని, వాళ్ళందరికీ ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే ఆల్పాహారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తన వద్దకు వచ్చే వాళ్ళకు ఆల్పాహారం, మధ్యాహ్న భోజనం ఉంటుందన్నారు. అయితే, ఇందుకు భిన్నంగా పెద్ద మొత్తంలో సందర్శకుల కోసం ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. తాను అందుబాటులో ఉండే, హైదరాబాద్ మంత్రుల నివాసం, హనుమకొండలోని ఆర్ అండ్ బి అతిథి గృహం, పాలకుర్తి క్యాంపు కార్యాలయం, పర్వతగిరిలోని తమ ఇంటి వద్ద ఈ సదుపాయం ఉంటుందని, ప్రజలు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.