
వర్షం చినుకులు పడుతున్నప్పుడు లేదా చల్లటి వాతావరణంలో బొగ్గులపై కాల్చిన మొక్కజొన్న కంకులు తింటే వచ్చే మజానే వేరు. కాలేజీ పిల్లల నుంచి పెద్దాళ్ల వరకూ వీటిని ఇష్టపడని వారు ఉండరు. మరి మొక్కజొన్న కంకులు (అదేనండి మక్క బుట్టలు) ఆరోగ్యానికి మంచిదేనా? అంటే పోషకాహారనిపుణులు అవుననే అంటున్నారు. వీటిల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయంటు న్నారు. మక్కల్లో పీచుపదార్థాలతో పాటు మొక్కలకు సంబంధించిన ప్రొటీన్లు కూడా బాగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తాయట. అంతేకాదు కంటి ఆరోగ్యానికి కూడా మక్కబుట్టలు చాలా మంచివని వైద్యులు అంటున్నారు. అయితే ఏదైనా అతిగా తింటే మంచిది కాదు. మక్కల విషయంలోనూ అంతే. అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే బ్లడ్ షుగర్ ప్రమాణాలు కూడా పెరుగుతాయి. మీ హెల్దీ డైట్ లో వీటిని మితంగా చేరిస్తే ఆరోగ్యానికి ఇవి చేసే ఉపకారం ఎంతో. అయితే జన్యుసంబంధమైన మక్కలు ఆరోగ్యానికి మంచివి కాదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇవి గ్లూటెన్ ఫ్రీ. గోధుమపిండి స్థానంలో మక్కపిండిని వాడొచ్చు. అంతేకాదు మక్కల్లో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, యాంటాక్సిడెంట్లు కూడా ఉన్నాయి. వీటిల్లో ప్రధాన పోషకంగా చెప్పే పొటాషియం మక్కల్లో బాగా ఉంది. ఇది రక్తప్రసరణ బాగా జరిగేలా చేయడమే కాదు గుండె ఆరోగ్యంగా కొట్టుకునేలా చేస్తుంది. అలాగే మక్కల్లో ఉండే ల్యూటిన్ వల్ల కంటికి సంబంధించి మస్క్యులర్ డీజనరేషన్, శుక్లాల వంటి వాటి రిస్కు తక్కువగా ఉంటుందిట. ఇక ఇందులోని పీచుపదార్థాల వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వీటిల్లోని ఫైబర్ బ్లడ్ సుగర్ ప్రమాణాలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఇందులోని క్వెర్ సెటిన్ అనే యాంటాక్సిడెంట్ వల్ల అల్జిమీర్, డెమన్షియా వంటి వాటి బారిన తొందరగా పడమంటున్నారు. ఇది న్యూరాన్ కణాలను పరిరక్షించడమే కాకుండా న్యూరో ఇన్ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుందిట. వీటితోపాటు మక్కల్లో విటమిన్ బి6 కూడా ఉంది. శరీరంలో రక్తహీనతకు కారణమయ్యే పెరిడాక్సిన్ లోటును ఇది పూరిస్తుంది. ఒక కప్పు మొక్కజొన్నగింజలు తినడం వల్ల ఒక రోజుకు సరిపడే పది శాతం పీచు పదార్థాలు శరీరానికి అందుతాయిట. మీ డైట్ లో భాగంగా మక్కలను ఉడకబెట్టి కాస్త ఉప్పు చల్లుకుని తినొచ్చు. సలాడ్స్ పైన సీజనింగ్ చేసుకొని కూడా తినొచ్చు. మక్కగింజలతో ఇంట్లోనే బ్రెడ్ తయారుచేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మీ హెల్తీ డైట్ లో మక్కబుట్టలను భాగం చేసుకోవచ్చు. అయితే వీటి వాడకంలో మితం హద్దు మాత్రం దాటొద్దుసుమా.