
నాగ్పూర్ విమానాశ్రయంలో గురువారం ఒక విషాదం చోటుచేసుకుంది. విమానం బయలుదేరాల్సిన కొద్దిసేపు ముందే దాన్ని నడపాల్సిన పైలట్ చనిపోయారు. చెన్నైకి చెందిన మనోజ్ సుబ్రమణ్యం అనే 40 ఏళ్ల వయసున్న పైలట్ సెక్యూరిటీ ఏరియాలోనే గుండె పోటుకు గురై చనిపోయారు. నాగ్పూర్ నుంచి పూణే వెళ్లాల్సిన ఇండిగో విమానానికి మనోజ్ ఫైలట్. గుండెపోటుతో ఈ వారంలో మరో పైలట్ కూడా మృతి చెందారు. బుధవారం ఖతార్ ఎయిర్వేస్లో ఢిల్లీ నుంచి దోహాకు ప్యాసింజర్లా వెళ్తున్న ఒక సీనియర్ పైలట్ అనారోగ్యంతో మార్గమధ్యలోనే మృతి చెందారు. కాగా, మనోజ్ సెక్యూరిటీ ఏరియాలో కింద పడిపోగానే అక్కడ ప్యాసింజర్లలో ఉన్న కార్డియాలజిస్ట్ ఒకరు పరీక్షించారు. అప్పటికే పైలట్ ఊపిరి పీల్చుకోవడం ఆగిపోయింది. సీపీఆర్ చేసిన అనంతరం హాస్పిటల్కి తరలించారు. కానీ ఆయన అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. జరిగిన సంఘటన పట్ల ఇండిగో యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా వేరే పైలట్ ద్వారా వారిని గమ్యానికి చేర్చారు.