
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సాయన్న, అలియాస్ సంగ్రామ్ అనారోగ్య కారణాలతో చనిపోయినట్లు తెలిసింది. రాజారెడ్డి మృతిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధృవీకరించారు. మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా దండకారణ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది.
ఇంటర్మీడియట్ వరకు చదివిన రాజిరెడ్డి ఉద్యమం పట్ల ఆకర్షితులై 1975లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరి రెండేళ్ల తర్వాత రెండో జిల్లా సదస్సుకు హాజరయ్యారు. 1977లో ధర్మపురి పోలీసులు అరెస్టు చేసి విడుదలైన తర్వాత అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయి 1981 వరకు మంథని, మహదేవ్పూర్ ఏరియాలో దళ సభ్యుడిగా, కమాండర్ గా పనిచేశాడు. ఆ తర్వాత 1996 వరకు మహారాష్ట్ర ఫారెస్ట్ డివిజన్, మధ్యప్రదేశ్(ప్రస్తుత ఛత్తీస్‌గఢ్)లోని బస్తర్ ప్రాంతంలో పనిచేశారు. 1997లో పీపుల్స్ వార్ లో సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. 1992లో బెంగళూరులో భారీ ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్న ఘటనలో, ఆదిలాబాద్‌లోని సిర్పూర్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడంతోపాటు 1986లో ఎస్సై, 12 మంది కానిస్టేబుళ్లను హతమార్చిన ఘటనల్లో ఈయన పాల్గొన్నట్లు పోలీస్ రికార్డులు వెల్లడిస్తున్నాయి.
అలాగే ఖమ్మం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 16 మంది పోలీసులను హతమార్చి, 1,624 రౌండ్ల మందుగుండు సామగ్రితోపాటు 32 ఆయుధాలను ఎత్తుకెళ్లిన ఘటన, 1998లో గడ్చిరోలి జిల్లా కుసన్సూర్లో 6 మందుపాతరలు, క్లైమోర్ మైన్లు పేల్చి ఆరుగురు పోలీసులను హతమార్చి రూ.4.4 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటనల్లో ఈయన ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్న సమయంలోనే 2007 డిసెంబర్ 18న మల్లా రాజి రెడ్డి, ఆయన భార్యను కేరళలోని అంగనమలిలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆరేళ్లు జైలులో పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు 2013లో బెయిల్ మంజూరయ్యాక తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.