
రానున్న ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఈ నెల 23న మెదక్ లో మెట్టమొదటి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, మూడవ సారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ సభ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి శంఖారావం పూరిస్తారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావ్ అన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం ఆయన మెదక్ వచ్చి సీఎం ప్రారంభించనున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్, ఎస్పీ ఆఫీస్ బిల్డింగ్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బిల్డింగ్లను, బహిరంగ సభాస్థలిని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు చాలా రోజుల ముందే ఒకేసారి వంద మందికిపైగా అభ్యర్థులను ప్రకటించిన ఏ పార్టీకి లేదన్నారు. అభ్యర్థుల ఖరారుతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో ఉత్సాహం ఉరకలెత్తుతోందని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. దీంతో అందరిలో గెలుపు ధీమా వ్యక్తమవుతోందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోయిన సారి ఎన్నికల్లో ఒక స్థానం పోగా, ఈ సారి 10 కి 10 స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత వ్యూహాన్ని ఏ పార్టీ ఊహించలేదని, ఒకేసారి అభ్యర్థుల ప్రకటనతో విపక్ష పార్టీలు కకావికలం అయ్యాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా డీలా పడిపోయిందని, కాంగ్రెస్ పార్టీది ఉత్త గోల మాత్రమే నన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న గ్లోబెల్స్ ప్రచారంతో ప్రజల మనసు గెలవలేరన్నారు. ఎవరు అవాకులు, చెవాకులు పేలినా ఎవరూ పట్టించుకోరన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఉన్నారు.