– ఓల్డ్ సిటీ మెట్రో రైల్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ పాతనగరంలో మెట్రోరైల్ పనులను తక్షణమే ప్రారంభించాలని ఓల్డ్ సిటీ మెట్రో రైల్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్, బేగం పెట్, హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేట్ కార్యాలయంలో గురువారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్. రెడ్డి ను కలసి ఓల్డ్ సిటీ మెట్రో రైల్ జాయింట్ యాక్షన్ కమిటీ ముఖ్య నేతలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టును ఆలస్యం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే పనులు చేపడతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రాష్ట్ర అసెంబ్లీలో హామీ ఇచ్చిన తర్వాత కూడా పనులు ప్రారంభానికి నోచుకోక పోవడం దుర్మార్గమన్నారు. దీని ద్వారా పాతబస్తీలో మెట్రో రైలు కనెక్టివిటీని అందించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమౌతుందని వారు పేర్కొన్నారు. ఎక్కువ జనసాంద్రతతో ఉన్న పాతబస్తీ లో ప్రతిరోజూ దూర ప్రాంతాలకు వెళ్లే వారికి మెట్రో రైల్ పెద్ద ఊరటనిస్తుందని, పాతబస్తీ అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని పాత నగరంలో ఏంజిబిఎస్ నుండి ఫలక్‌నుమా వరకు 5.5km బ్యాలెన్స్ మెట్రో అలైన్మెంట్ పనులను మరింత ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని వారు కోరారు. మెట్రో రైల్ కనెక్టివిటీ వస్తుందనే ఆశతో ఉన్న పాతబస్తీ వాసుల ఆశలను వమ్ము చేస్తే ఉరుకునేదిలేదని, మెట్రో రైల్ సాధించే వరకు పెద్దఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ సిటీ మెట్రో రైల్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ఈ. టి. నరసింహ, ఉస్మాన్ హల హజారీ, కె. వెంకటేష్, ఎండి. మూస కరీం, హైదరాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.