
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మందులు లేకుండా
నొప్పులు పోగొట్టుకోవాలనుకుంటున్నారా? మోకాళ్ల నొప్పులను
తగ్గించే ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. నొప్పి ఉన్న చోట ఆలివ్
ఆయిల్ తో ఐదు నిమిషాలు మర్దనా చేసి గోరువెచ్చని నీటితో కడిగేస్తే
నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. కొబ్బరినూనెను గోరువెచ్చగా
చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో మెల్లగా మర్దనా చేస్తే కూడా మోకాళ్ల
నొప్పుల నుంచి సాంత్వన పొందుతారు. ఆవనూనెను వేడి చేసి
అందులో ఒక వెల్లుల్లి రెబ్బ దంచి వేసి అది బ్రౌన్ రంగులో
వచ్చువరకూ ఉంచాలి. నూనె గోరువెచ్చగా అయిన తర్వాత దానితో
మోకాలును మర్దనా చేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం
పొందుతారు. నొప్పి తగ్గేవరకూ వారానికి రెండుసార్లు ఇలా చేయాలి.
యాపిల్ సిడార్ వెనిగర్ తో కూడా మోకాళ్లనొప్పులు పోతాయి. రెండు
కప్పుల గోరువెచ్చటి నీళ్లల్లో రెండు టీస్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్
కలిపి ఆ మిశ్రమాన్ని నొప్పి తగ్గే దాకా ప్రతి రోజూ తాగితే కూడా మంచి
ఫలితం కనిపిస్తుంది. అల్లం కూడా మోకాళ్ల నొప్పి, వాపులను బాగా
తగ్గిస్తుంది. చిన్న అల్లం ముక్కను తీసుకుని దాన్ని కచ్చాపచ్చాగా
దంచి ఒక కప్పు నీళ్లల్లో వేసి పది నిమిషాలు ఉడకబెట్టి ఆ నీళ్లను
వొడగట్టాలి. ఆ నీళ్లల్లో రుచికి తేనె, నిమ్మరసం కొద్దిగా కలిపి తాగితే
కూడా నొప్పి తగ్గుతుంది. లేదా రోజూ రెండు లేదా మూడు గ్లాసుల
అల్లం టీని మోకాలు నొప్పి తగ్గేవరకూ తాగాలి. పసుపులో కూడా
నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఒక టీస్పూన్ పసుపు తీసుకుని
అందులో ఒక టీస్పూను నీళ్లు కలిపి పేస్టులా చేయాలి. దాన్ని
మోకాలు నొప్పి పెడుతున్న ప్రదేశంలో రాయాలి. ఇలా రోజుకు
రెండుసార్లు నొప్పి తగ్గేవరకూ మోకాలికి రాస్తే తొందరగానే మోకాలు
నొప్పి నుంచి సాంత్వన పొందుతారు.