
లావుగా ఉన్నవాళ్లు స్లిమ్ గా ఎలా కనిపించాలా అని తెగ బాధపడిపోతుంటారు. అందుకోసం వాళ్లు చేయని ప్రయత్నం ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిని బరువు తగ్గించే రోటీ తినండంటున్నారు మన పోషకాహారనిపుణులు.
ఇంతకూ బరువు తగ్గించే ఆ రోటీ ఏమిటి? ఎలా చేసుకోవాలి? బయట దొరకుతుందా? మనమే చేసుకోవాలా? లాంటి బోలెడు ప్రశ్నలు ఈపాటికి మిమ్మల్ని చుట్టుముట్టేసి ఉంటాయి. అదేదో కొత్త వంటకమేమీ కాదు. అందరికీ తెలిసిందే. ఇంతకూ అదేమిటంటే మల్టీగ్రెయిన్ మిల్లెట్ రోటీ. దీన్ని తింటే బరువు బాగా తగ్గుతారట. పైగా అందులో బోలెడు పోషకాలు కూడా ఉన్నాయంటున్నారు పోషకాహారనిపుణులు.
మిల్లెట్ రోటి అంటున్నారు కదా…దాని రుచి ఎలా ఉంటుందో అని డల్ అయిపోయారా? ఆ సమస్యే లేదంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచితో పాటు మిమ్మల్ని ఈ రోటీ స్లిమ్ చేస్తుందని చెప్తున్నారు కూడా. వైట్ లాస్ డైట్ లో చాలామంది మిల్లెట్ రోటీలు తినరు. కానీ అది సరికాదంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఈ రోటీ మీ శరీరంలోని అదనపు బరువును, కొవ్వును తగ్గిస్తుందంటున్నారు. అందుకే దీనిని తప్పనిసరిగా డైట్ లో నిత్యం ఉండేలా చూసుకోవడం సర్వోత్తమమని సలహా ఇస్తున్నారు. ఈ రోటీ తినడంతో మీ వెయిట్ లాస్ లక్ష్యాన్ని చేరుకుంటారని భరోసా సైతం ఇస్తున్నారు.
మల్టీగ్రెయిన్ రోటీ లేదా మిల్లెట్ రోటీతో బరవు బాగా తగ్గామని పోషకాహారనిపుణులు కూడా చెప్పడం ఇందులోని మరో విశేషం. మల్టీ గ్రెయిన్ రోటీలోని పీచుపదార్థాల వల్ల జీర్ణశక్తి బాగుంటుందంటున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఈ రోటీ నిరోధిస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఇది మంచి డయాబెటిక్ డైట్ కూడా అని అంటున్నారు. ఈ రోటీ శరీరానికి కావలసిన ఎన్నో విటమిన్లను అంటే విటమిన్ ఎ, కె, బి6, సి వంటి వాటితో పాటు శరీరానికి కావలసిన అత్యవసరమైన ఖనిజాలను అంటే జింకు, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి వాటిని కూడా మల్టీ గ్రెయిన్ మిల్లెట్ రోటీ అందిస్తుందిట.
మిల్లెట్స్ లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరిగి తొందరగా జబ్బుల బారిన పడమని చెప్తున్నారు. పైగా మిల్లెట్స్ లో ప్రొటీన్లు కూడా పుష్కలమని, అందుకే వీటిని కొద్దిగా తింటే చాలు కడుపునిండినట్టయి ఆకలి తొందరగా వేయదట కూడా. దీంతో బరువును పెంచే చిరుతిళ్లు తినాలనే ఆలోచనే మనసులోకి రాదుట. దీంతో బరువు పెరగమని పోషకాహారనిపుణులు చెప్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చిన మిల్లెట్లను ఎంచుకుని వాటిన్నింటినీ కలిపి మెత్తటి పిండిలా చేసుకుని రోటీ చేసుకోవడమే.
మల్టీ గ్రెయిన్ మిల్లెట్ రోటీ పిండిలో చిటికెడు ఉప్పు వేసి గోరువెచ్చటి నీళ్లతో ఆ పిండిని బాగా తడిపి పిండిముద్దగా చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిని గోధుమపిండితో ఒత్తి రోటీల్లా చేసుకోవాలి . అలా రోటీలుగా చేసిన వాటిని సన్నని మంటపై కాల్చాలి.అంతే వెయిట్ లాస్ మల్టీ గ్రెయిన్ మిల్లెట్ రోటీ రెడీ. దాన్ని కూరతో లాగించడమే తరవాయి. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ వెయిట్ లాస్ రోటీని తినడం షురూ చేయండి…స్లిమ్ గా…మరింత ఆరోగ్యంగా అయిపోండి… ఏమంటారు?