
రాష్ట్రంలో అంతుపట్టని వైరస్ డాక్టర్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. దగ్గు, జ్వరంతో వచ్చే పేషంట్లను ఎట్లా ట్రీట్ చేయాలో అంతుపట్టకుండా ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతోపాటు ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి చాలా మంది హాస్పిటళ్లలో చేరుతున్నారు. కొందరికి లంగ్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయి. దాంతో డాక్టర్లు ఇది స్వైన్ ఫ్లూ అనీ, కోవిడ్–19 కేసులని భావించి పరీక్షలు చేయిస్తున్నారు. కానీ అందులో నెగెటివ్ వస్తోంది. విపరీతమైన దగ్గు, గొంతు నొప్పి, చలి జ్వరం, ముక్కు కారడం లాంటి లక్షణాలు ఈ వైరస్ వల్ల ఉంటున్నాయి. 100 డిగ్రీలకు పైగా జ్వరం వస్తోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటోందని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కంప్లెయింట్స్ వచ్చే పేషంట్ల సంఖ్య పెరుగుతోందని ఆయన అన్నారు. కాకపోతే ఈ లక్షణాలతో ఉన్న వాళ్లు ట్రీట్మెంట్తో ఐదు రోజుల్లో కోలుకొంటున్నారని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వాళ్లు సొంత వైద్యం కన్నా డాక్టర్లను సంప్రదించడం మంచిదని అంటున్నారు.