
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ దగ్గరలోని ఐతవరం మద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెల్సిందే. అన్ని వాహనాలతోపాటు ఆర్టీసీ బస్సులు కూడా రద్దయ్యాయి. రెండు వైపుల వందలాది మంది ప్రయాణీకులు నిల్చిపోయారు. అయితే ఈ రూట్ల నిత్యం వేలాది మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్నామ్నాయ మార్గంలో బస్సు సేవలు పునరుద్ధరించాలని తలపెట్టింది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులు నడపనున్నామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రతి అర గంటకో బస్సు ఈ మార్గంలో నడుస్తుందనీ, అత్యవసర ప్రయాణం అవసరమైన వారు ఈ సర్వీసు వినియోగించుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ 040–6944000, 040–23450033 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.