
ఓ ప్రమాదమే వారి ప్రాణాలు కాపాడింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో ఒక ప్రమాదం జరిగింది. ఒక లారీ, బస్సును ఢీకొట్టింది. నిజానికి ఇలాంటి ప్రమాదాలు ప్రాణాంతకంగా మారుతాయి. కానీ ఇక్కడో విచిత్రం జరిగింది.
శ్రీశైలం నుంచి తెలంగాణలోని మునుగోడుకు వస్తున్న ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దాంతో బస్సు డ్రైవర్ దిక్కుతోచకుండా ఉన్న పరిస్థితుల్లో నరసరావుపేట నుంచి వెళ్తున్న నవత ట్రాన్‌పోర్ట్ లారీ ఊహించని విధంగా బస్సును ఢీకొట్టింది. దాంతో బస్సు అక్కడికక్కడే ఆగిపోయింది. స్వల్ప గాయాల పాలైన ప్రయాణీకులు అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
లారీ గనక ఢీకొట్టకపోతే బ్రేకులు ఫెయిలయిన బస్సు దేన్ని ఢీకొట్టి తమ ప్రాణాలు ఏమయ్యేవో అని ప్రయాణికులు బతుకు జీవుడా అనుకున్నారు. పెట్లూరివారి పాలెం. ఉప్పలపాడు మధ్య జరిగిన ఈ ఘటనలో లారీ డ్రైవర్ కూడా సేఫ్‌గా ఉన్నాడు. దీంతో జరిగింది ప్రమాదమే అయినా తమందరి ప్రాణాలు కాపాడిందని అందరూ సంతోషించడం విశేషం.
