
‘‘ఎన్నికలస్తే హడావిడిగా వార్ రూమ్‌లు ఏర్పాటు చేస్తారు. వరదలొస్తే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయరా? వర్షాలు, వరదలు వచ్చినపుడు అది మీ బాధ్యత కాదా” అని హైకోర్టు రాష్ట్ర సర్కార్‌పై మండిపడింది. వరదల్లో చనిపోయిన వాళ్లు, నిరాశ్రయులైన వాళ్లు, నిస్సహాయుల గురించిన సమాచారం, వాళ్లకు అందించిన సహాయం గురించి వివరాలు అందజేయాలని శుక్రవారం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద తగిన చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నేత చెరకు సుధాకర్ 2020లో హైకోర్టులో పిటిషన్ వేశారు. శుక్రవారం ఆయన దానికి అనుబంధ పిటిషన్ వేయగా సీజే అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు చేపట్టింది. తదుపరి విచారణను ఈ నెల 31 (జులై)కి వాయిదా వేసింది.