
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే మన రాష్ట్రంలో గోదావరి ప్రారంభమవుతుందనీ, ఈ నది ఉత్తర తెలంగాణకు ప్రాణప్రదాయిననీ, సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల అది ఇపుడు దుఖదాయినిగా మారిందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ప్రాజెక్టులకు, చెక్‌డ్యాంలకు వ్యతిరేకం కాదనీ, కేవలం కేసీఆఱ్ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకి అని తెలిపారు. కేసీఆర్ చర్యల వల్ల కడెం డ్యామ్ ప్రమాదంలో పడడంతోపాటు మంచిర్యాల ప్రతి సంవత్సరం నీట మునుగుతోందన్నారు. జిల్లాల్లోని పరిస్థితులను పరిశీలించేందుకు నిర్మల్ వచ్చిన ఈటల మాట్లాడుతూ వేల ఎకరాల పంటల్లో ఇసుక మేట వేసిందన్నారు. తాటి చెట్టు లోతు కయ్యలు పడ్డాయన్నారు. పొలాలన్నీ పనికి రాకుండా పోయాయన్నారు. కడెం తెగిపోతే 35 ఊర్లు కొట్టుకుపోతాయని, గేట్ల సంఖ్య పెంచమని నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే దాన్ని అమలు చేయడం లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లా అనేక వాగులకు నిలయమన్నారు. వీటి మీద చెక్ డ్యామ్‌లు సైంటిఫిక్‌గా కట్టి ముంపు లేకుండా చేయలన్నారు. సదర్మాట్ కాలువ మూడు దిక్కుల గండిపడి 12 వేల ఎకరాలు కొట్టుకుపోయాయన్నారు. వరదల మీద రిపోర్ట్ తయారుచేసి కేంద్రానికి ఇస్తామన్నారు.