
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాతవరణంలో తేమ పెరిగి రకరకాల వైరస్ లు, బాక్టీరియా ఇన్ఫెక్షన్లు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. ఫ్లూ వంటి వాటితో పాటు అధికసంఖ్యలో కండ్ల కలక కేసులు కూడా రాష్ట్రంలో నమోదవుతున్నాయి. కండ్లకలక అంటువ్యాధి కావడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వేగంగా సంక్రమిస్తుంది. గులాబీరంగు కండ్లకలక, మరీ ముఖ్యంగా ఫోలిక్యులర్ కండ్లకలక కేసులు దేశవ్యాప్తంగా బాగా పెరుగుతున్నాయి. కండ్లకలక సోకితే ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కంటి వైద్యులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
ఎందుకు వస్తాయంటే:
కండ్లకలక రావడానికి ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, ఇరిటేషన్లు ప్రధాన కారణం. మనచుట్టూ ఉన్న పర్యావరణం కూడా ఈ పరిస్థితికి కారణమని చెప్పాలి. స్టఫిలోకోకస్, గొనోకోకస్ వంటి బాక్టీరియాల వల్ల, వైరస్ల వల్ల కండ్లకలకలు వస్తాయి. వీటి బారిన పడిన వారి వల్ల, అలాగే పురుగుపుట్రలు కుట్టడం వల్ల , కల్తీ కాస్మొటిక్స్ వల్ల కూడా కండ్లకలకల బారిన పడతాం. పుప్పొడిరేణువులు, దుమ్ము, జంతువుల వెంట్రుకలు, ఈకలు వంటివాటి వల్ల కూడా కళ్లు ఎలర్జీల బారిన పడతాయి. కాంటాక్టు లెన్సులు మార్చకుండా దీర్ఘకాలం ఉపయోగించినా కళ్లకు ఈరకమైన ఎలర్జీలు వస్తాయి. వీటితోపాటు కాలుష్యం, విషతుల్య రసాయనాలు కూడా కళ్లపై దుష్ప్రభావాన్ని చూపుతాయి.
పెద్దలు, పిల్లలు జాగ్రత్త:
కంటి తెల్లభాగం, కనురెప్పల లోపలివైపును కప్పి ఉంచే పల్చటి శ్లేష్మపొరైన కంన్జక్టివా ఇన్ఫ్లమేషన్నే కండ్ల కలక అంటారు. ఇది వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల, అలర్జీలు లేదా కొన్ని రసాయనాల ప్రభావం వల్ల వస్తుంది. అన్ని వయసుల వారికీ ఇది సోకుతుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవాళ్లు, చిన్నారులు దీని బారిన తొందరగా పడతారు. ఈ వర్గం వారికి ఇది మరింత ఎక్కువగా హాని కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే కండ్లకలక ఉన్నట్టు అనిపిస్తే ఆలస్యం చేయకుండా చికిత్సను వెంటనే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు:
కండ్లకలక వచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రతలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పరిశుభ్రతను పాటించాలి. మందులను క్రమంతప్పకుండా వాడాలి. యాంటిబయొటిక్స్, స్టెరాయిడ్ల వంటివాటిని విచక్షణారహితంగా వాడకూడదు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్సను కొనసాగించాలి. కండ్లకలకలో పలు రకాలు ఉన్నాయి. జలుబు, శ్వాస ఇన్ఫెక్షన్లు ఉన్న పిల్లలు, యువతలో కొన్ని రకాల కండ్లకలకలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు చెపుతున్నారు. కండకలక అంటు వ్యాధి కాబట్టి అది సోకిన వ్యక్తి ఇతర కుటుంబసభ్యులకు, తోటివారికి దూరంగా ఉండాలి. తరచు చేతులు కడుక్కుంటుండాలి. కళ్లపై చేతులు పెట్టుకోవడం, కళ్లను తాకుతుండడం చేయకూడదు. కండ్లకలక సోకిన వారు తమ వ్యక్తిగత వస్తువులను, కాస్మొటిక్స్ వంటి వాటిని ఇతరులతో పంచుకోకూడదు.
చికిత్స:
చికిత్స విషయానికి వస్తే కండ్లకలక రకం, లక్షణాలను బట్టి దానికి అందించే చికిత్స మారుతుంటుంది. గోరువెచ్చటి కాపడాలు, మందుచుక్కలు, ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే మందుల వాడకం చికిత్సలో ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే చికిత్స సమయంలో కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోకూడదు. కంటి నుంచి కారే స్రావాన్ని మెత్తటి తడి బట్టతో తుడుచుకోవాలి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయొటిక్ చుక్కలను ఇస్తారు. వైరల్ ఇన్ఫెక్షన్లకు కోర్సు ఉంటుంది. లక్షణాలను బట్టి కూల్ కంప్రసెస్ వంటివి సూచిస్తారు.
లక్షణాలు:
కళ్ల కలక లక్షణాలు గుర్తించడం సులభమే. కళ్లు ఎరుపు లేదా పింక్ (గులాబీ)రంగులో ఉంటాయి. కళ్లల్లో జీరలు ఉంటాయి. కాంతిని కన్ను భరించలేదు. కళ్లు బాగా దురద పెట్టడంతో పాటు మండుతుంటాయి. కంటి నుంచి అధిక స్రావం అవుతుంటుంది. కొందరికి జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కూడా ఉంటాయి. కనురెప్పల్లో వాపు కనిపిస్తుంది. కంజెక్టివా ఇరిటేషన్ ఉంటుంది. కండ్లల్లో నలకలు, దుమ్ము ధూళి పడినట్టుండి గరగరలాడుతుంటాయి. పొద్దున్న నిద్రలేచినపుడు కనురెప్పలు ఒకదానితో ఒకటి అతుక్కుపోయింటాయి. ఈ లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను వెంటనే సంప్రదించాలి.