
మీరు కొన్న మందులు అసలా…నకిలీనా అనే విషయం ఇకపై క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఎలా అంటారా? ఆగస్టు ఒకటి నుంచి ఉత్పత్తి అయ్యే టాప్ సెల్లింగ్ మెడిసెన్ల ప్యాకేజి ఇకపై క్యూఆర్ కోడ్ తో అన్ని మందుల షాపుల్లో లభ్యంకానుంది. ఆ కోడ్ ను స్కాన్ చేస్తే మీరు కొన్న మందులకు సంబంధించిన తయారీ లైసెన్స్, బ్యాచ్ నెంబర్ వంటి అన్ని ముఖ్య వివరాలు ఉండి మందుల సురక్షితను అవి మనకు వెంటనే నిర్ధారిస్తాయి. కల్తీ మందులతో పాటు మందుల నాణ్యతాలోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజంలో భాగంగా ఈ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మొదటిదశలో భాగంగా 300 టాప్ సెల్లింగ్ మెడిసెన్ల ప్యాకేజింగ్‌పై ఆగస్టు ఒకటి నుంచి క్యూఆర్ కోడ్ రానుంది. మందుల రిటైల్ మార్కెట్లో వీటి విలువ యాభ్భై వేల కోట్ల దాకా ఉంది. యాంటీబయొటిక్స్, కార్డియాక్ మాత్రలు, పెయిన్ రిలీఫ్ మాత్రలు, యాంటిడయాబెటిక్స్ మందులు, యాంటీ ఎలర్జీ మందులు కూడా ఈ జాబితా మెడిసిన్లలో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కల్తీమందుల ఘటనలు పెక్కు బయటపడడం, తక్కువ నాణ్యత ఉన్న మందులు మార్కెట్లలో చెలామణీ బాగా అవుతుండడంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇంపోర్టెడ్ మెడిసెన్ల పై సైతం క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది.