
రోజూ వాకింగ్ ఎంతసేపు చేయొచ్చు అనే సందేహం చాలామందిని వేధిస్తుంటుంది. అయితే వైద్యులు ఏ సమయంలోనైనా అరగంట పాటూ కనీసం నిత్యం నడవాలంటున్నారు. అలా చేస్తే అది శరీరానికి ఇచ్చే బలం ఎంతోనంటున్నారు. వాకింగ్ అనేది కార్డియో కిందకు వస్తుంది. నడవడం, జాగింగ్, ఫాస్ట్ వాకింగ్ వంటివి గుండె బలానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా గుండెకు వాకింగ్, జాగింగ్ చాలా మంచివి. అయితే దీర్ఘకాలంలో మనకు గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే మాత్రం వెయిట్ ట్రైనింగ్ చేయాలంటున్నారు వైద్యులు.

సహజంగా వ్యాయామాలు మొదలెట్టేవారు వాకింగ్‌తో మొదలెడతారు. రోజుకు పదివేల అడుగులు అంటే ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకూ నడిస్తే గుండెకు చాలా మంచిదనే అభిప్రాయం చాలామంది వ్యక్తంచేయడం వింటుంటాం. ప్రారంభంగా ఈ అలవాటు చాలా మంచిది. పైగా గుండెకు వాకింగ్ చేసే మంచి ఎంతో. అయితే ఇండియాలో గుండె ఆరోగ్యానికి సంబంధించి గైడ్ లైన్స్ ఉన్నా అవి అంత పటుతరంగా లేవనే అభిప్రాయం ఉంది. అమెరికా హార్ట్ అసోసియేషన్ వారు వాకింగ్ మీద బాగా అధ్యయనం చేశారనే అభిప్రాయం కూడా ఉంది. ఆ అసోసియేషన్ చెప్తున్న దాని ప్రకారం రోజుకు కనీసం నలభై నిమిషాల పాటు వారానికి ఐదు నుంచి ఆరు రోజులు నడిస్తే వాళ్ల గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు. అయితే ఎలా నడుస్తున్నారన్నది కూడా ముఖ్యమే.

ఇంట్లో నడిచినట్టు కాకుండా కాస్తంత ఫాస్ట్ వాకింగ్ చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. ఇంట్లో ట్రెడ్ మిల్ ఉంటే కనీసం నాలుగున్నర కిలోమీటర్ల స్పీడు పెట్టుకుని చేస్తే మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో చేసుకునే పనులు మీద పెట్టే ఎఫెర్టు కన్నా కూడా కాస్తంత ఎక్కువ ఎఫెర్టు శరీరంపై పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడు అది శరీరానికి బాగా ఉపయోగపడుతుందటున్నారు. చేసే వాకింగ్ ఉపయోగపడేలా ఉండాలి. బరువు తగ్గించేదిలా, షుగర్ ఉంటే దాంట్లో మెరుగుదల వచ్చేలా నడక ప్రయత్నం సాగాలి. అప్పుడే వాకింగ్ వల్ల ప్రయోజనం అని కూడా వైద్యులు చెప్తున్నారు. ఫాస్ట్ వాకింగ్ చేయాలనేది గతంలో ఉండేది. కానీ ఒక్కొక్క మనిషి శరీరానికి ఒక్కోరకమైన టాలరెన్స్ ఉంటుంది కాబట్టి ఎంతవరకూ వాకింగ్ చేయగలను అనేదాకా ప్రతి వ్యక్తి తన నడకను పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అంటే మీ పరిమితి ఏదైతే ఉందో దాన్ని చేరుకునేలా మీ వాకింగ్ సమయం పెరుగుతూ సాగాలి. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరం పెయిన్ టాలరెన్స్ పెంచుకునేంత వరకూ మన వాకింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.

ఇక అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారైతే ఎంత తీవ్రమైన గుండెజబ్బులు ఉన్న వారు కూడా ఎంతో కొంత శరీరానికి వ్యాయామం ఇవ్వాలంటున్నారు. వ్యాయామం చేయకపోతే గుండె బలం తగ్గే అవకాశం తక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటిదాకా గుండె బలం పెంచే మందులు లేవనే విషయం మరొవొద్దని కూడా చెపుతున్నారు. గుండెపోటు లాంటివి వచ్చి సర్జరీ జరిగిన తర్వాత బలహీనపడ్డ గుండె బలంగా తయారవాలంటే వ్యాయామలు తప్పనిసరి అంటున్నారు. గుండె బలం పెంచేది ఏదైనా ఉందంటే అది వ్యాయామం మాత్రమే అనే విషయం మరవొద్దని చెపుతున్నారు. వ్యాయామం చేస్తే తప్ప గుండె బలం పెరిగే అవకాశం లేదంటున్నారు. ఇక వయసు పెరిగే కొద్దీ మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అలాంటి వాళ్లు వాకింగ్ చేయకూడదనే అభిప్రాయం వింటుంటాం. కానీ అదెంతవరకూ నిజం? మోకాళ్ల నొపులు ఉన్నవాళ్లు నడవడం కష్టం కాబట్టి వాళ్లు కూర్చుని చేసే సైక్లింగ్ చేయాలంటున్నారు వైద్యులు. అది చేస్తే బరువు మోకాళ్ల మీద పడదు. ఎందుకంటే కదలని సైకిల్ పై కూర్చుని వాళ్లు చేస్తారు కాబట్టి బరువు శరీరంపై పడదు. మన శరీర స్థితికి అనుగుణంగా వ్యాయామాలు మార్చుకుంటూ చేయాలి తప్ప మోకాళ్లు నొప్పులు ఉన్నాయి కాబట్టి నేను వ్యాయామాలు చేయను అనుకోవడం పూర్తిగా పొరబాటు అని కూడా వైద్యులు స్పష్టంచేస్తున్నారు.

వ్యాయామాలు ఎలాంటి సమయంలో చేస్తే మంచిది అనే సందేహం కూడా చాలామందిలో చూస్తాం. అయితే వాటికి సమయం అంటూ ఏమీ లేదు. కానీ ఉదయం వేళల్లో చేస్తే మంచిది. కుదరకపోతే రోజులో ఏ సమయంలోనైనా వ్యాయామాలు చేయొచ్చు. కానీ ప్రతి రోజూ ఒక గంటపాటు చేస్తే శరీరానికి చాలా మంచిది. శరీర ఆరోగ్యం కాపాడుకోవాలనే నిబద్ధత ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఉండాలంటున్నారు వైద్యులు. ఎన్ని గంటలు చేయాలనే దానికన్నా నిత్యం కనీసం అరగంట పాటు తప్పనిసరిగా వాకింగ్ చేయడం వల్ల శరీరారోగ్యం బాగుంటుందనడంలో సందేహం లేదని వైద్యులు అంటున్నారు. అంత టైము కూడా నిత్యం లేని వాళ్లు సమయం దొరికినపుడు షార్ట్ వాక్స్ చేసినా శరీరానికి ప్రయోజనమేనని చెప్తున్నారు. ఇతరులతో కలిసి వాకింగ్ చేయడం అనేది మనసుకు, శరీరానికి కూడా ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుందని కూడా వైద్యులు అంటున్నారు.

ఏదైనా హై ఇంటెన్సిటీతో కూడిన వ్యాయామాలు చేయాలనుకుంటే మటుకు తప్పనిసరిగా వైద్యుల సలహాను తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన వారైనా, ఏవైనా అనారోగ్యాలు ఉన్నా తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకుని ఆ తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయాలో వైద్యుని అడిగి తెలుసుకుని వాటిని చేయాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. వాకింగ్, వ్యాయామాల ద్వారా నిత్యం ఒక ఫిజికల్ యాక్టివిటీని ప్రతి ఒక్కరూ తమ లైఫ్ లో పెంచుకోవాలని వైద్యులు చెప్తున్నారు. వాకింగ్ ను ప్లెజరబుల్ గా చేయాలి తప్ప ప్రెషర్ తో చేయడం వల్ల ఉపయోగం లేదని సూచిస్తున్నారు కూడా. వాకింగ్ అనేది వెయిట్ బెయరింగ్ ఎక్సెర్సైజు. వాకింగ్ వల్ల కార్డియోవాస్కులర్, పల్మనరీ ఫిట్ నెస్ బాగా పెరుగుతుంది. గుండెజబ్బులు, స్ట్రోక్ వంటి వాటి రిస్కు తక్కువ.

వాకింగ్ వల్ల హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. జాయింట్, మస్క్యులర్ పెయిన్ ని నియంత్రిస్తుంది. మధుమేహాన్ని పెరగకుండా నియంత్రిస్తుంది. నడక వల్ల కండరాలు బలంగా తయారవడమే కాదు శరీరం బ్యాలెన్స్ పెంపొందుతుంది. కండరాల బలంతో పాటు దృఢత్వం కూడా పెరుగుతుంది. శరీరం ఫ్యాట్ ను కూడా నడక తగ్గిస్తుంది. మీ వాకింగ్ పవర్ ను పెంచుకోవాలంటే కొండల్లాంటి ఎత్తైన ప్రదేశాలలో నడవొచ్చు. హ్యాండ్ వెయిట్స్ తో నడవొచ్చు. వేగంగా నడవడం ద్వారా వాకింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎక్కువ దూరాలు నడవొచ్చు. అయితే తగిన ఆరోగ్య సలహాలను వైద్యుల నుంచి తీసుకోవడం మరొవొద్దని కూడా ఆరోగ్యనిపుణులు చెప్తున్నారు.