
ఎండనపడి వచ్చి బత్తాయి జ్యూసు తాగితే వచ్చే శక్తి అందరికీ అనుభవమే. ఈ పండు దాహాన్నే కాదు అంతకుమించిన లాభాలనే మనకు అందిస్తోంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ పండు రసం మనకు ఇచ్చే శక్తి మాటలకు అందనిది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇక ఇది శరీరానికి చేసే మేలు అందరికీ తెలిసిందే.

బత్తాయి రసం శరీరానికి అందించే ఇమ్యూనిటీ పవర్ అయితే చెప్పనవసరం లేదు. ముందే చెప్పినట్టు బత్తాయి మనకు అందించే బలం, రోగనిరోధక శక్తులతో పాటు ఇంకెంతో మంచిని పంచుతోంది. మరి అలాంటి పండును నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికి చేటేనంటున్నారు పోషకాహారనిపుణులు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరోగ్యానికి ఇది సూపర్ స్టార్ పండు అని కితాబు ఇస్తున్నారు. ఈ పండు విటమిన్ సికి మాత్రమే కాదు శరీరారోగ్యాన్ని పెంచే మరెన్నో విటమిన్లు, ఖనిజాల నిధి. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్, ఎ, సి విటమిన్లు, ఫోలేట్ ఇలా ఇందులో ఉన్న సుగుణాలు ఎన్నో.

సీజనల్ జబ్బులు దరికి రాకుండా కాపాడే మిరకల్ పండు బత్తాయి. ఇక ఇందులో ఉన్న యాంటీబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటి అల్సర్ సుగుణాల గురించి చెప్పనవసరం లేదు. ఈ పండులోని మరెన్నో ‘రసా’త్మక సుగుణాలు దీన్ని తాగి ఆనందించాల్సినవే నంటారు బత్తాయి ప్రియులు. ఈ పండులో ఉన్న యాంటాక్సిడెంట్లు చూస్తే ఇది మన రోగనిరోధక వ్యవస్థను కాపాడే సంజీవని అంటారు పోషకాహారనిపుణులు. అంతేనా? ఈ బత్తాయి బాడీ డిటాక్స్ ఏజెంట్ కూడా. శరీరంలోని మలినాలన్నింటినీ బయటకు పోగొట్టి శరీరాన్ని మరింత ఎనర్జైస్ చేస్తుందంటున్నారు.

ఊబకాయ నిపుణులు సైతం. శరీరాన్ని డిటాక్సిఫై చేసే బత్తాయి రసం నేచురల్ డిటాక్సింగ్ సూపర్ ఫ్రూట్. శరీరంలో కాలుష్యం, ఒత్తిడుల వల్ల పెరిగే విషతుల్యపదార్థాలను పోగొట్టడంలో సైతం ఈ పండుకు ఏదీ సరిరాదు. బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఇది మంచి బడ్డీ. మెటబాలిజం బూస్టర్. క్రేవింగ్స్ కు చెక్ పెట్టే పండు. ఆకలిని తగ్గించే పీచుపదార్థాలు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. జీర్ణశక్తి బాగుంటే శరీరం ఆరోగ్యవంతమైన నాజూకుతనంతో ఎంతో స్లిమ్ గా ఉంటుంది. అంతేకాదు బత్తాయి శరీరానికి కావలసినంత తేమను సైతం అందిస్తుంది. ఇందులోని యాంటాక్సిడెంట్ల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాదు ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.

జీర్ణవ్యవస్థను సమతుల్యంగా పనిచేసేలా చేస్తుంది. మలబద్దకాన్ని పోగొడుతుంది.ఒక్కమాటలో చెప్పాలంటే బత్తాయిపండులోని సుగుణాలు మనల్ని నిత్యం అందంగా…ఆరోగ్యంగా…ఆనందంగా ఉండేలా చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి బత్తాయి పండుని మీ డైట్ లో నిత్యం ఉండేలా చూసుకోవాలని ప్రత్యేకించి చెప్పాలా? చిన్నా, పెద్దా అందరికీ ఈ పండు బలమే కాదు ఆరోగ్యానికి వరం కూడా…మరి బత్తాయా…‘మజా’క్యా?
