

ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా విఆర్ఏ వ్యవస్థ కొనసాగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు. కొత్త ఉద్యోగాలు చేపట్టనున్న వీఆర్ఏలందరికీ సీఎం అభినందనలు తెలిపారు.
10 వ తరగతి అర్హత కలిగిన వారు 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ హోదాతో, డిగ్రీ ఆ పై విద్యార్హత కలిగిన 3,680 మంది జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తారని సీఎం తెలిపారు. మరో కేటగిరీలో 3,797 మంది 61 సంవత్సరాలు దాటిన వారికి, వారు ఇంత కాలం సమాజానికి చేసిన సేవకు గాను, మానవీయ కోణంలో ఆలోచించి వారి పిల్లలకు ఉద్యోగాలిస్తామని సీఎం తెలిపారు. “వీఆర్ఏలు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులు” అని సీఎం స్పష్టం చేశారు.