
పెరుగు, తేనె కలిపితే మీ చర్మం మెరుపులు చిందిస్తుంది. ఎలా అంటారా… పెరుగు, తేనె రెండూ ప్రొబయొటిక్. ఇవి రెండూ జీర్ణశక్తిని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణశక్తి బాగుంటే చర్మం కూడా మెరుపులు చిందిస్తుందంటున్నారు పోషకాహారనిపుణులు కూడా. పెరుగులో బోలెడు పోషకాలు ఉన్నాయి. తేనె కూడా ఈ విషయంలో ఏమాత్రం తీసిపోదు. అంతేకాదు చక్కెరకు బదులు దీన్ని వాడుకోవచ్చు కూడా. ఇంకా తేనె, పెరుగు కలిపి చేసుకునే డెజర్టు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మొటిమలు, యాక్నే, పలురకాల చర్మసమస్యలను ఇవి రెండూ బాగా పరిష్కరిస్తాయి. చర్మానికి గాలిసోకేలా చేస్తాయి. చర్మంపై ఉండే మృతకణాలు పోగొట్టి మంచి డిటాక్సిఫైయర్ గా పెరుగు ఉఫయోగపడుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఈ విషయంలో పెరుగు, తేనె కాంబినేషన్ చర్మంపై వండర్స్ సృష్టిస్తుంది. పెరుగులో చల్లదనం ఉంటే తేనెలో వేడి గుణాలు ఉన్నాయి. ఇవి రెండూ రెండు రకాల విరుద్ధ గుణాలు కలిగినవి. సహజంగా ఇలాంటి లక్షణాలు శరీరతత్వాన్ని దెబ్బతీస్తాయి. కానీ పెరుగు, తేనె కాంబినేషన్ ఈ విషయంలో డిఫరెంట్.
పెరుగులో పీచు, కాల్షియం, ప్రొబయొటిక్స్,ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంది. ఇది ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని బలోపేతం చేస్తుంది. వెయిట్ మేనేజ్ మెంటులో కూడా మంచి ఫలితాలు పొందుతాం. తేనెలో కూడా ప్రొబయొటిక్ గుణాలు ఉన్నాయి. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. జీర్ణశక్తి బాగుంటే చర్మ ఆరోగ్యం మరింతగా మెరిపిస్తుంది. జీర్ణశక్తి బాగోలేకపోతే దాని దుష్ప్రభావం చర్మంపై పడుతుంది. యాక్నే, మొటిమలు, దద్దుర్లు, ఎగ్జిమా వంటివి ఎన్నోతలెత్తుతాయి. జీర్ణాశయం అనారోగ్యం వల్ల శరీరంలో విషపదార్థాలు ఎక్కువవుతాయి. దీంతో చర్మంలోని సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ ప్రమాణాలు బాగా తగ్గుతాయి. ఈ విషయంలో పెరుగు, తేనె కాంబినేషన్ చాలా మంచి చేస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ ,తేనెలోని మాయిశ్చరైజింగ్ ను పెంపొందించే గుణాలు చర్మంపై సహజసిద్ధమైన మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. చర్మంలో, శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యం చేస్తాయి. అలాగే తేనె, పెరుగు సహజసిద్ధమైన ఎక్స్ ఫొయిలేటర్స్ గా పనిచేస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా తయారవుతుంది. తేనె, పెరుగు రెండింటిలో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల చర్మానికి ఇవి ఎంతో సాంత్వననిస్తాయి.ఇరిటేషన్లను పోగొడతాయి. యాక్నే వంటివి రాకుండా నిరోధిస్తాయి. వీటి రెండింటిలో యాంటిబయొటిక్ సుగుణాలు కూడా ఉన్నాయి. ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని ఇవి రెండూ పరిరక్షిస్తాయి. చర్మంపై ఏర్పడే ముడతలు, ఫైన్ లైన్స్ ను ఇవి పోగొడతాయి. సో…మీ వంటింట్లోనే మీ చర్మ ఆరోగ్యం దాగుందనమాట.