
ఫ్రెషర్ డేలో తోటి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయింది ఓ ఇంటర్ విద్యార్థిని. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది. అప్పటిదాకా సంతోషంగా నృత్యాలు చేసిన తోటి విద్యార్థులు, టీచర్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యు కన్నీరు మున్నీరవుతున్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో ఇవాళ సాయంత్రం ఈ ఇన్సిడెంట్ జరిగింది. స్కూళ్లో జరిగిన ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులంతా కలిసి సంతోషంగా నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా ప్రదీప్తి కుప్పకూలిపోయిందని తోటి విద్యార్థులు, టీచర్లు చెబుతున్నారు. వెంటనే సీపీఆర్ చేసి కరీంనగర్ తరలిస్తుండగా అప్పటికే చనిపోయింది.
ప్రస్తుతం ప్రదీప్తి మృతదేహాన్ని కరీంనగర్ సివిల్ ఆస్పత్రి నుంచి స్వగ్రామం తరలించారు. కూతురు మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీరి స్వస్థలం గంగాధర మండలంలోని వెంకటాయపల్లి. ఈ గ్రామానికి చెందిన గుండు అంజయ్య కూతురైన ప్రదీప్తికి చిన్నప్పటి నుంచే గుండెలో రంధ్రం ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం గుండెకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వీలు కాలేదని చెబుతున్నారు. ఇంతలోనే కూతురు కన్నుమూయడంతో అటు తల్లిదండ్రులు, ఇటు గ్రామస్థుల్లో, తోటి విద్యార్థుల్లో అంతులేని విషాదం నెలకొంది.