
రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ లోని పిహెచ్సి, యుపిఎస్సి, ఆర్ బిఎస్ కేలలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలనీ, లేనియెడల ఈ నెల 16 నుండి నిరవధిక సమ్మె చేస్తామని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం సత్యనారాయణ రెడ్డి భవన్లో యూనియన్ అధ్యక్షురాలు బి.వనజ అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎంల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లడారు. గత సంవత్సర కాలంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండవ ఏఎన్ఎం లందరినీ భవిష్యత్తుగా రెగ్యురేషన్ చేయాలని పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన అన్నారు. పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో ఈ రెండవ ఏఎన్ఎం లందరికీ కేవలం అంతరంగిక పరీక్షలో పెట్టి రెగ్యులర్ చేసిన విషయాన్ని ప్రభుత్వం గమనించాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ పద్ధతి ఉండబోదని హామీ ఇచ్చిన అప్పటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంట్రాక్ట్ పద్ధతిన నియమాంకాలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. ధనక రాష్ట్రమని చెప్పుకునే రాష్ట్రంలో జీతాలు విడుదల చేయడానికి కూడా సమయం తీసుకోవడం దురదృష్టకరమన్నారు. కరోనా కష్టకాలంలో రోజుకు 1000 మందికి పైగా వ్యాక్సిన్ వేసిన రెండవ ఏఎన్ఎం లను విస్మరించటం సరికాదన్నారు. ఎన్నో వినతులు, పోరాటాలు చేసిన తర్వాతనే సమ్మె నిర్ణయానికి వచ్చామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి వారిని సమ్మెకు వెళ్లకుండా ఉండేందుకు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో పిహెచ్ సి,యు పిహెచ్ సి, ఆర్ బి ఎస్ కేలో పనిచేస్తున్న వారందరూ ఈనెల 16వ తేదీ నుండి సమ్మెకు దిగనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.