దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ BRS పార్టీ జనరల్ బాడీ సమావేశం మంత్రి అద్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ లైన్ లు, పార్క్ ల అభివృద్ధి, దేవాలయాల అభివృద్ధి వంటి పలు అభివృద్ధి పనులు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా మొట్టమొదటగా మన నియోజకవర్గ పరిధిలో చేపడుతున్నట్లు వివరించారు.
అన్ని మతాల ఆచారాలను, సంస్కృతులను గౌరవించే విధంగా బోనాలు, బతుకమ్మ, గణేష్ నవరాత్రులు, రంజాన్, క్రిస్మస్, వంటి అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా పేద, మద్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. వినూత్న కార్యక్రమాలను చేపట్టి దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అభివృద్దిలో ఎంతో వెనుకబడిన దళితుల కోసం దళిత బందు పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ కార్యక్రమం క్రింద అర్హులైన ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు.
మొదటి విడతలో నియోజకవర్గ పరిధిలో 100 మందికి ఆర్ధిక సహాయం అందించినట్లు వివరించారు. రెండో విడతలో 1100 మందికి 10 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సొంత ఇల్లు కట్టుకొనే వారికి ఆర్ధికంగా చేయూతను అందించాలనే ఉద్దేశంతో గృహలక్ష్మి క్రింద అర్హులకు 3 లక్షల రూపాయలను అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ పథకం క్రింద నియోజకవర్గ పరిధిలో 3 వేల మందికి లబ్ది చేకూరుతుందని అన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన బీసీ కులాలకు అర్హులైన ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం నియోజకవర్గ పరిధిలో ౩౦0 మందికి అందిస్తామని చెప్పారు. అదేవిధంగా దివ్యాంగులకు బ్యాటరీ తో కూడిన త్రీ వీలర్ వాహనాన్ని ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. అధికారులు మీ మీ ఇండ్ల వద్దకు వచ్చి అర్హులను గుర్తిస్తారని అన్నారు.
ఇవే కాకుండా వృద్దులు, దివ్యాంగులు, వితంతువులకు ప్రతినెల ఆసరా పెన్షన్ క్రింద ఆర్ధిక సహాయం అందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. పేదింటి ఆడపడుచు పెండ్లి కోసం ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారిగా అందించాబడుతుందని, అందరికి అందే విధంగా కృషి చేస్తానని మంత్రి ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వస్తున్నాని, ఎలాంటి అవసరమున్నా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.