
పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో ఏజెన్సీల ద్వారా పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది వేతనాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఆస్పత్రి లెర్నింగ్ సెంటర్ లో ఆదివారం ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించారు. కొత్తగా టెండర్లు దక్కించుకున్న కార్తీక సెక్యూరిటీ ఏజేన్సీ ద్వారా 140 మంది సిబ్బందిని నియమించారు. మరియు 12మందిని మాజీ సైనిక అధికారులను సెక్యూరిటీ ఆఫీసర్స్ గా నియమించారు.
వారిని ఉద్దేశించి డైరెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులు వారి సహాయకులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు.ఆస్పత్రి ప్రాంగణంలో వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయకుండా నిర్దేశించిన స్థలంలో నిలిపేలా సూచనలు చేయాలని చెప్పారు. ఏజెన్సీలు వేతనాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని ఇక నుంచి అలాంటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. సెక్యూరిటీ సిబ్బందికి విధి నిర్వహణలో ఏదైనా అనారోగ్య సమస్యలు, అత్యవసర వైద్యం అవసరమైతే ఉచితంగా అందిస్తామని చెప్పారు. మహిళా సిబ్బందిని ఎవరైనా వేధిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశామని, ఎవరికైనా సమస్య వస్తే ఆ కమిటీకి ఫిర్యాదు చేయాలని చెప్పారు.