
పండ్లు తింటున్నారా? ఆరోగ్యానికి ఫ్రూట్స్ చాలా మంచివి.శరీరానికి అవి ఎంతో ఎనర్జీనిస్తాయి. అంతేకాదు పండ్లు పోషకాల నిధి. అయితే పండ్లను తినే పద్ధతిలో తినాలి. ఎందుకంటే వీటిని తినేడప్పుడు చాలామంది కొన్ని పొరబాట్లు చేస్తుంటారు. సాధారణంగా కొందరు పండ్లను తిన్నవెంటనే నీళ్లు తాగుతుంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే చాలా పండ్లల్లో నీటి శాతం బాగా ఉంటుంది. ఆ నీరు శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కానీ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియపై అది దుష్ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియను నెమ్మది చేయడంతోపాటు ఎసిడిటీ సమస్య వస్తుంది. శరీరంలో నీళ్లు ఎక్కువైనపుడు కిడ్నీల పనితీరు కూడా మందగిస్తుంది. ఫలితంగా తలతిరగడం, తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటాం. అందుకే పండ్లు తిన్న కనీసం గంట తర్వాతే నీళ్లు తాగాలి.
మనలో చాలామందికి ఉన్న మరో దురలవాటు పండ్లను ముక్కలుగా కోసి ఫ్రిజ్ లోనో, బయటో పెట్టి ఎప్పుడో తింటుంటాం. కానీ పండ్లను ముక్కలుగా కోసిన వెంటనే తినాలి. అప్పుడే వాటిల్లోని పోషకాలు శరీరానికి సంపూర్ణంగా అందుతాయి. ఆలస్యం చేసిన కొద్దీ ఆ పండ్లల్లోని పోషకవిలువలు బాగా తగ్గిపోతాయి. వాటి సువాసనలు పోతాయి. పండు ముక్కల్లో నీరు తగ్గిపోయి మెత్తగా అవుతాయి. అందుకే పండును కడిగిన వెంటనే తినడం మంచిది. మరొక అంశం ఏమిటంటే పండ్లను పండ్లల్లాగే తింటే మంచిది. వాటిని జ్యూసులా చేసుకుని తాగితే వాటిల్లోని ఎన్నో ముఖ్యమైన పోషకాలు పోతాయి. అలా అని జ్యూసులు తాగకూడదని కాదు కానీ వాటిల్లోని పోషకాలు పోని విధంగా ఉపయోగిస్తే మంచిది. అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత కొందరు పండ్లు తింటుంటారు. ఇది మంచి అలవాటు కాదు.
పండ్లల్లో ఉండే షుగర్ వల్ల శరీరంలో ఎనర్జీ ప్రమాణాలు పెరిగి నిద్ర సరిగా పట్టదు. నిద్రలేమి శరీర ఆరోగ్యంపై ఎంతో దుష్ప్రభావాన్ని చూపుతుంది. అలాగే పచ్చిగా ఉన్న ఫ్రూట్స్ తినకుండా ఉండడం మంచిది. చల్లగా ఉన్న ఫ్రూట్స్ కూడా కడుపులో సులువుగా జీర్ణం కావు. పచ్చిగా ఉన్న పండ్లు తినడం వల్ల కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. వీటిని తింటే అజీర్తి, గ్యాసు సమస్య, ఎసిడిటీ, మలబద్దకం, కడుపులో పోట్లు వంటి గాస్ట్రోఇంటస్టైనల్ సమస్యలు తలెత్తుతాయి. అందుకే పండ్ల పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందాలంటే గది ఉష్ణోగ్రతలో ఉన్న పండిన పండ్లను తగిన పరిమాణంలో, తగిన టైములో తినడం సర్వదా మంచిది. ఆ అలవాటు మన శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. పండ్లను తినేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకుండా ఉంటే మంచిది.